సిక్కు సంతతి బాలుడి హత్య కేసులో ఇద్దరు యువకులకు యూకే కోర్ట్ జైలు శిక్ష విధించింది.వనుషాన్ బాలకృష్ణన్, ఇలియాస్ సులేమాన్‌లు 2021లో వెస్ట్ లండన్( West London )లో మృతుడు రిష్మీత్ సింగ్( Rishmeet )ను దారుణంగా హతమార్చారు.
ఈ నేరానికి గాను బుధవారం ఓల్డ్ బెయిలీ కోర్ట్ వారిద్దరికి జీవితఖైదు విధించింది.బాలకృష్ణన్‌కు 24 ఏళ్లు, సులేమాన్‌కు 21 ఏళ్లు జైలు శిక్ష విధించినట్లు మెట్ పోలీసులు తెలిపారు.
తీర్పు సందర్భంగా రిష్మీత్ తల్లి గులీందర్ మాట్లాడుతూ.ఎట్టకేలకు తన బిడ్డకు న్యాయం జరిగిందన్నారు.
కానీ ఈ శిక్ష సరిపోదని.వారు తన నుంచి జీవితాన్ని దూరం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా.ఆఫ్ఘనిస్తాన్( Afghanistan ) నుంచి ఆశ్రయం పొందేందుకు తన తల్లి, నానమ్మతో కలిసి 2019 అక్టోబర్‌లో యూకేకు వచ్చిన రిష్మీత్‌ను .ప్రత్యర్ధి ముఠాకు చెందిన వ్యక్తిగా భావించిన ఇద్దరు నిందితులు దాదాపు 15 సార్లు పొడిచి పొడిచి చంపారు.నవంబర్ 24, 2021 రాత్రి.
రిష్మీత్ ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నాడు.ఈ సందర్భంగా ఇద్దరు వ్యక్తులు అతని వైపు పరిగెత్తుకురావడం చూశాడు.
దీంతో భయాందోళనకు గురైన రిష్మీత్ సౌతాల్‌లోని రాలీ రోడ్ వైపు పరిగెత్తాడు.

అయితే అతనిని వెంబడించిన నిందితులు వెనుక నుంచి 15 సార్లు విచక్షణారహితంగా పొడిచి పారిపోయారని మెట్ పోలీసులు తెలిపారు.27 సెకన్లలోనే అంతా జరిగిపోయిందని వారు వెల్లడించారు.రక్తపు మడుగులో పడివున్న రిష్మీత్‌ను చూసిన స్థానికులు 999కి సమాచారం అందించారు.
దీంతో లండన్ అంబులెన్స్ సర్వీస్ ఘటనాస్థలికి చేరుకుని అత్యవసర చికిత్సను అందించినప్పటికీ, అప్పటికే రిష్మీత్ ప్రాణాలు కోల్పోయాడు.సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు బాలకృష్ణన్, సులేమాన్‌ను అరెస్ట్ చేశారు.
ఈ హత్యపై రిష్మీత్ తల్లి గులీందర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఇప్పటికే తాను భర్తను కోల్పోయానని.
ఇప్పుడు ఒక్కగానొక్క బిడ్డను కూడా పొగొట్టుకున్నానని కన్నీటి పర్యంతమయ్యారు.







