కేరళలో ( Kerala ) దారుణం చోటు చేసుకుంది.వందనా దాస్ (23)( Dr.
Vandana Das ) అనే యువ వైద్యురాలు కొల్లాం జిల్లా కొట్టారక్కరాలోని ఓ ఆసుపత్రిలో బుధవారం దారుణంగా హత్యకు గురైంది.హత్య చేసిన వ్యక్తిని వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు ఆసుపత్రికి తీసుకొచ్చారు.
సస్పెండ్ అయిన పాఠశాల ఉపాధ్యాయుడు సందీప్( Sandeep ) ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.ఈ వ్యక్తి తన కుటుంబ సభ్యులతో గొడవకు దిగి చివరికి కాలికి దెబ్బ తగిలించుకున్నాడు.
దానికి ట్రీట్మెంట్ ఇప్పించేందుకు పోలీసులు అతడిని ఆసుపత్రికి వచ్చారు.
చికిత్స సమయంలో, సందీప్ ఒక్కసారిగా రెచ్చిపోయాడు.
అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిపై ఒక కత్తెర, స్కాల్పెల్తో దాడి చేశాడు.ఆ తర్వాత అతనికి చికిత్స చేస్తున్న డాక్టర్ వందన వైపు తిరిగి ఆమెను పలుమార్లు కత్తితో పొడిచాడు.
ఆమెను కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ, కొన్ని గంటల తర్వాత వందన కన్నుమూశారు.ఈ దాడిలో సందీప్తోపాటు ఉన్న పోలీసు సిబ్బందికి కూడా గాయాలయ్యాయి.

ఈ ఘటనపై కేరళ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో వైద్య వర్గాలు, ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA), కేరళ ప్రభుత్వ వైద్య అధికారుల సంఘం (KGMOA) రెండూ దాడిని ఖండించాయి.బాధ్యులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశాయి.

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.డా.దాస్ కుటుంబానికి తన సంతాపాన్ని తెలియజేశారు.ఘటనపై సమగ్ర విచారణకు హామీ ఇచ్చారు.విధి నిర్వహణలో ఆరోగ్య కార్యకర్తలపై దాడి చేయడం సహించరానిదని ఆయన అన్నారు.డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలపై జరుగుతున్న అఘాయిత్యాలను అడ్డుకునేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు.







