నల్లగొండ జిల్లా: ఎవరైనా మీ మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్నా లేదా దొంగించబడినా www.ceir.gov.in పోర్టల్ నందు ఫిర్యాదు చేయాలని నల్లగొండ జిల్లా ఎస్పీ కె.అపూర్వరావు అన్నారు.గురువారం నల్గొండ టూ టౌన్ పరిధిలో పోగొట్టుకున్న యాభై ఫోన్లను సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ ద్వారా వెతికి,జిల్లా పోలీస్ కార్యాలయంలో 50 మంది బాధితులకు అందజేసి, www.ceir.gov.in పోర్టల్ పై ప్రత్యేక అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోయిన లేదా దొంగలించబడిన మొబైల్ ఫోన్లను త్వరితగతిన పట్టుకోవడానికి CEIR (Central Equipment Identity Register) అనే వెబ్ సైట్ లో సంబంధిత వివరాలను నమోదు చేసుకున్నట్లైతే అలాంటి మొబైల్స్ ను ఈ పోర్టల్ ద్వారా సులభంగా స్వాధీనం చేసుకునే ఆస్కారం ఉంటుందని తెలిపారు.ఈ పోర్టల్ నిర్వహణకు సంబంధించి అన్ని పోలీస్ స్టేషన్ల నందు అధికారులకు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు.ఈ పోర్టల్ యొక్క ఆవశ్యకతను తెలుపుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని,ఎవరైతే వినియోగదారులు వారి పోయిన మొబైల్స్ వివరాలను ఈ రిపోర్టర్ లో నమోదు చేసుకోవడం వల్ల సులువుగా గుర్తించడం జరుగుతుందని తెలిపారు.
CEIR (CENTRAL EQUIPMENT IDENTITY REGISTER ) ఎలా పనిచేస్తుంది…?
కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖా ఆద్వర్యంలో CEIR (CENTRAL EQUIPMENT IDENTITY REGISTER ) సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ ప్రవేశపెట్టింది.ఇందుకోసం www.ceir.gov.in వెబ్ సైట్ లో లాగిన్ కావాలి.అందులో రెక్వెస్ట్ ఫర్ బ్లాకింగ్ లాస్ట్/స్టోలెన్ మొబైల్ లింక్ కనబడుతుంది.దానిపై క్లిక్ చేయాలి.పోయిన చరవాణిలోని నంబర్లు, ఐఏంఇఐ నంబర్లు,కంపెనీ పేరు,మోడల్,కొన్న బిల్లు అప్లోడ్ చేయాలి.
మొబైల్ ఏ రోజు ఎక్కడ పోయింది, రాష్ట్రం,జిల్లా,పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసిన వివరాలు నమోదు చేయాలి.చివరగా వినియోగదారుడి పేరు, చిరునామా,గుర్తింపు కార్డు, ఈ-మెయిల్ ఐడి,ఓటిపి (OTP) కోసం మరో చరవాణి నెంబర్ ఇవ్వాలి.
ఇదంతా పూర్తయిన తర్వాత ఒక ఐడి నెంబర్ వస్తుంది.సంబంధిత ఐడి ఫోన్ స్టేటస్ తెలుసుకోవచ్చు.
మొబైల్ ఏ కంపెనీ అయినా సీఈఐఆర్ విధానం ద్వారా ఫోన్ పని చేయకుండా చేస్తుంది.
చరవాణి దొరికిన తర్వాత వినియోగదారుడు అదే వెబ్సైట్లోకి వెళ్లి ఆన్ బ్లాక్/ఫౌండ్ మొబైల్ అనే లింక్ పై క్లిక్ చేయాలి.
ఐడి నమోదు చేయగానే ఫోన్ అన్ బ్లాక్ అవుతుంది.చరవాణి పోయిన వెంటనే తమ పరిధిలోని పోలీసులకు సమాచారం అందించాలని CEIR (CENTRAL EQUIPMENT IDENTITY REGISTER ) సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అప్లికేషన్ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
ఈ సందర్భంగా సాంకేతికను ఉపయోగించి మొబైల్ ఫోన్లను వెతికి పట్టుకొని ఉత్తమ ప్రతిభ కనబరిచి 2 టౌన్ ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి,సిబ్బంది బాలకోటి,శంకర్లను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో ప్రొబేషనరీ ఐపిఎస్ శేషాద్రిని రెడ్డి,అడిషనల్ ఎస్పీ కెఆర్కె ప్రసాదరావు, నల్లగొండ డిఎస్పి నరసింహారెడ్డి,ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి,సిబ్బంది బాలకోటి,శంకర్ పాల్గొన్నారు.