వైసీపీ సీనియర్ నేత, జగన్ బంధువు ,ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి( Balineni Srinivasareddy ) వ్యవహారం ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.మొదటి మంత్రివర్గంలోనే మంత్రి పదవి దక్కించుకున్న బాలినేని, రెండో విడత మంత్రి వర్గ విస్తరణలో ఆ పదవి కోల్పోయారు.
ఇక అప్పటి నుంచి అంత యాక్టివ్ గా కనిపించడం లేదు.అయితే ఆయనకు నెల్లూరు, తిరుపతి, వైఎస్సార్ జిల్లాల సమన్వయకర్త గా బాధ్యతలు అప్పగించి అసంతృప్తి కి గురికాకుండా జగన్( Jagan Mohan Reddy ) చూసుకున్నారు.
అయితే తాజాగా బాలినేని వైసిపి సమన్వయకర్త బాధ్యతలకు రాజీనామా చేశారు.తన నియోజకవర్గమైన ఒంగోలు పై దృష్టి పెట్టేందుకు, తనకున్న అనారోగ్య సమస్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజీనామా లేఖలో బాలినేని పేర్కొన్నారు.

దీంతో వైసీపీలో కీలకనేతగా , జగన్ బంధువుగా గుర్తింపు పొందిన బాలినేని పార్టీ పదవులకు రాజీనామా చేయడం వైసిపిలో ( YCP ) కలకలం రేపుతోంది.గత కొంతకాలంగా జగన్ తీరుపై నాయకులు చాలామంది అసంతృప్తితో ఉన్నారని బాలినేని ఈ నిర్ణయం తీసుకోవడం వంటివి సంచలనంగా మారింది.ఇది ఇలా ఉంటే అసలు బాలినేని ఈ స్థాయిలో అసంతృప్తికి గురికావడం వెనక కారణాలు చాలానే ఉన్నాయట.తనను మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలకడం, అదే సమయంలో తమ జిల్లా నుంచి మంత్రిగా ఉన్న ఆదిమూలపు సురేష్ ను ఇప్పటికీ మంత్రిగా కొనసాగించడంపై బాలినేని శ్రీనివాస్ రెడ్డి తీవ్ర అసంతృప్తికి గురయ్యారట.

అందుకే ఆయన అంతగా యాక్టివ్ గా ఉండడం లేదట.దీనికి తగ్గట్లుగానే ఇటీవల మార్కాపురంలో జగన్ పర్యటన సందర్భంగా మరింతగా అసంతృప్తికి గురయ్యారట.దీంతో పాటు, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు టికెట్ బాలినేని కి కాకుండా, ఓ మహిళకు ఇచ్చేందుకు జగన్ సిద్ధమవుతున్నారనే వార్తలు కూడా ఈ అసంతృప్తికి కారణమట.దీంతో పాటు పార్టీలో తనకు వ్యతిరేకంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి , టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి పావులు కలుపుతున్నారనే అనుమానాలు ఇవన్నీ బాలినేని అసంతృప్తికి గురికావడానికి కారణమనే గుసగుసలు వినిపిస్తున్నాయి.







