సింగపూర్‌లో( Singapore ) విషాదం చోటు చేసుకుంది.తల్లిని చంపిన కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న 41 ఏళ్ల భారత సంతతికి చెందిన వ్యక్తి ఇక్కడి చాంగి జైలులో మరణించాడు.
ఈ మేరకు స్థానిక మీడియా కథనాలను ప్రసారం చేస్తోంది.మృతుడిని సుజయ్ సోలమన్ సుదర్శన్‌గా ( Sujay Solomon )గుర్తించారు.
ఇతను ఆగస్టు 11, 2015లో 56 ఏళ్ల తన తల్లిని కత్తులతో విచక్షణారహితంగా పొడిచి, గొంతు కోసి చంపినట్లు ది స్ట్రెయిట్స్ టైమ్స్ నివేదించింది.డబ్బు ఇచ్చేందుకు నిరాకరించడంతోనే తన తల్లి మల్లికా జేసుదాసన్‌ను( Mallika Jesudasan ) జట్టుపట్టుకుని ఈడ్చానని, ఆపై హతమార్చినట్లు హైకోర్టు విచారణ సందర్భంగా సుదర్శన్ నేరాన్ని అంగీకరించాడు.
ఆత్మరక్షణ కోసమే తన తల్లి గొంతులో కత్తి దించినట్లు చెప్పాడు.ఆపై మరో రెండు కత్తులను కూడా గొంతులో గుచ్చినట్లు తెలిపాడు.
కాగా.తల్లి మృతదేహాన్ని తగులబట్టడానికి సుదర్శన్ చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో అతను శవాన్ని మంచం కింద దాచిపట్టి.
ఫ్లాట్‌ను శుభ్రం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

నిందితుడు సెప్టెంబర్ 8, 2022న సెప్టిసిమియా( Septicemia ) కారణంగా మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్స్‌తో మరణించినట్లు సింగపూర్ మీడియా తెలిపింది.ఇతనికి స్క్రిజోఫెనియా అనే మానసిక వ్యాధితో పాటు విటమిన్ బీ12 లోపం, సెన్సోరీ అటాక్షియా వంటి జబ్బులు వున్నట్లు మెడికల్ హిస్టరీ చెబుతోంది.నరాల బలహీనత కారణంగా శరీర అవయవాలు సమన్వయం కోల్పోవడం వంటి సమస్యలతో సుదర్శన్ బాధపడ్డాడు.

ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 5, 2022న సుదర్శన్ తన ఆరోగ్య పరిస్ధితుల దృష్ట్యా వైద్యుడిని సంప్రదించాడు.అదే రోజున మూడు సార్లు వాంతి చేసుకోగా, మాట్లాడటం, మింగడం తనకు కష్టంగా వుందని మృతుడు వైద్యుడికి చెప్పాడు.ఈ క్రమంలో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో జైలు అధికారులు సుదర్శన్‌ను సెప్టెంబర్ 6, 2022న హుటాహుటిన చాంగి జనరల్ హాస్పిటల్‌లో( Changi General Hospital ) చేర్చారు.అక్కడ చికిత్స పొందుతుండగా ఆరోగ్యం విషమించడంతో సుదర్శన్ రెండు రోజుల తర్వాత తుదిశ్వాస విడిచాడు.
వైద్యులు అతని ప్రాణాలు కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ విఫలమయ్యారు.అతని మేనమామ ప్రతి మూడు వారాలకు ఒకసారి క్రమం తప్పకుండా జైలులో సుదర్శన్‌ను కలుసుకునేవారు.
ఈ క్రమంలో జైలులో తన మేనల్లుడికి అందించిన వైద్య చికిత్స పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.







