సూర్యాపేట జిల్లా:ఓ మహిళ పాయిజన్ తాగిందని, మరో మహిళకు పాము కరిచి మతిస్థితిమితం కోల్పోయిందని,మరో వ్యక్తికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని క్రియేట్ చేసి, మిర్యాలగూడ డాక్టర్స్ కాలనీలోని మహేష్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలోని ఐసీయూ సహా ఇతర ట్రీట్ మెంట్ చేసినట్లుగా నకిలీ బిల్లులు సృష్టించి ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి రూ.4.50 లక్షలకు పైగా అక్రమంగా డ్రా చేసిన విషయమై గత నెల 21వ తేదీన హైద్రాబాద్ లోని సైఫాబాద్ సీసీఎస్ లో సీఎంఆర్ఎఫ్ సెక్షన్ స్టాఫ్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.ఇందులో భాగంగా శుక్రవారం మిర్యాలగూడ డిప్యూటీ డీఎం అండ్ హెచ్ఓ కేస రవి,సిబ్బంది స్వామి మహేష్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి చేరుకుని వివరాలను సేకరించారు.
ఈ సందర్భంగా డిఎం అండ్ హెచ్ఓ మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం చెరువుతండా గ్రామ పంచాయితీకి చెందిన బాణావత్ లక్ష్మీ, బాణావత్ జ్యోతి, దామరచర్ల మండలం జేత్రాంతండాకు చెందిన ధీరావత్ నాగుకు సంబంధించి కేషీట్లను, డిశ్చార్జ్ రికార్డులను పరిశీలించినట్లు తెలిపారు.జిల్లా వైద్యారోగ్య శాఖ ఆఫీసర్ల ఆదేశాల మేరకు కీలక రికార్డులను స్వాధీనం చేసుకున్నామని పై ఆఫీసర్లకు రిపోర్ట్ చేస్తామని చెప్పారు.

నకిలీ బిల్లుల దందా రూ.2 కోట్లకుపైనే…?పాలకీడు మండలం ఒక తండా గ్రామ పంచాయితీకి చెందిన ఓ ఇద్ధరు వ్యక్తులు ఒకరు సర్పంచ్ భర్త మరొకరు మాజీ ఫీల్డ్ అసిస్టెంట్ సీఎంఆర్ఎఫ్ ఫండ్స్ కాజేసేందుకు నకిలీ బిల్లుల దందాకు తెరతీసిండ్రని విశ్వసనీయంగా తెలిసింది.గత కొన్నేళ్లుగా సీఎంఆర్ఎఫ్ నిధులను నకిలీ బిల్లులతో కాజేసే దందాను సాగిస్తుండగా ఎట్టకేలకు సీసీఎస్(సెంట్రల్ క్రైం స్టేషన్)లో కేసు నమోదుతో నకిలీల భాగోతం బట్ట బయలు అయింది.పాలకీడు, నేరేడుచర్ల,గరిడేపల్లి మండలాలకు చెందిన సుమారు 200మంది పేరిట సదరు ఇద్ధరు సూత్రదారులు నకిలీ బిల్లులను తయారు చేసి సుమారు రూ.2 కోట్లకు పైగా ఫ్రాడ్ చేసినట్లుగా విశ్వసనీయంగా తెలుస్తుంది.తెలంగాణ మల్టీ స్పెషాలిటీ,కోణార్క్ ఆస్పత్రులు ఈ నకిలీ బిల్లుల వ్యవహారం నేపథ్యంలో సీజ్ కాగా అప్పటి యాజమాన్యమే నిర్వహిస్తున్న మహేష్ మల్టీ స్పెషాలిటీలో తాజాగా నకిలీ సీఎంఆర్ఎఫ్ బిల్లుల దందా తెరపైకి వచ్చింది.
70 నుంచి 80శాతం నకిలీ బిల్లులను ఈ యాజమాన్యం సహకారంతోనే ఆ ఇద్ధరు సూత్రదారులు తీసుకుని సీఎంఆర్ఎఫ్ నిధులను కాజేసిండ్రన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.ప్రతి బిల్లులో రూ.20 నుంచి 30 వేలు ఆస్పత్రి యాజమాన్యం వాటాగా తీసుకుంటూ దందాను కొనసాగించాయని సమాచారం.అయితే ఈ మొత్తం దందా వెనుక ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఓ ముఖ్య నేత పీఏ సహకారం ఉందన్న ప్రచారం జరుగుతుంది.
అయితే సీఎస్ఎస్ పోలీసుల విచారణలో ఏం తేలుస్తారు…?ఈ దందాను ఏ విధంగా చేశారనేది ఇప్పుడు జిల్లాలో ఆసక్తిగా మారింది.అయితే ఆ ఇద్ధరు సూత్రదారులు అర్హతలేని వాళ్లకు కళ్యాణలక్ష్మీ స్కీంలను వర్తింప చేశారని విశ్వసనీయంగా తెలుస్తోంది.
అంతేకాదు వేరే వారితో పాటు కొంతమంది బ్యాచ్ గా ఏర్పడి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి కొన్ని ఆస్పటల్ లో నకిలీ సిఎంఆర్ఎఫ్ బిల్లులు వ్యవహారం నడిపినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.ఈ మొత్తం వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని విచారణ అధికారులు చెబుతున్నారు.