సైబర్ నేరగాళ్లు తెలివి మీరిపోతున్నారు.ప్రజలను తెలివిగా బుట్టలో వేసుకుని డబ్బులు కాజేస్తున్నారు.
నకిలీ ఆన్లైన్ సేల్ వెబ్సైట్లను తెరిచి ప్రజలను ఆకర్షిస్తున్నారు.నిత్యావసర సరుకులపై భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నారు.
వాటిని కొనుగోలు చేయాలని భావిస్తున్న మధ్యతరగతి ప్రజలను మోసగిస్తున్నారు.ఇదే తరహాలో నకిలీ వెబ్సైట్లను తెరిచి ఆన్లైన్లో ప్రజలను మోసం చేస్తున్న రాకెట్‌ను నోయిడా పోలీసులు సోమవారం ఛేదించారు.
సైబర్ ముఠాలోని ఆరుగురు సభ్యులను అరెస్టు చేశారు.ఈ ముఠా డి-మార్ట్, బిగ్ బాస్కెట్, బిగ్ బజార్ ( D-Mart, Big Basket, Big Bazaar )వెబ్సైట్లను రూపొందించి కోట్లాది రూపాయలను మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇటీవల కాలంలో డీమార్ట్, బిగ్ బాస్కెట్, బిగ్ బజార్ పేరుతో నకిలీ వెబ్సైట్లను ( Fake websites )నేరగాళ్లు ఓపెన్ చేశారు.వాటి ద్వారా కొనుగోలుదారులను ఆకర్షించడానికి భారీగా డిస్కౌంట్లు ప్రకటించారు.వస్తువులు కొనుగోలు చేసే క్రమంలో ప్రజలు క్రెడిట్/డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేస్తారు.ఆ సమయంలో వారి బ్యాంకు వివరాలు ఈ సైబర్ నేరగాళ్ల ముఠా తస్కరిస్తోంది.
అమాయక ప్రజల బ్యాంక్ ఖాతాల నుండి మోసపూరితంగా డబ్బును కాజేస్తోంది.దీనిపై ఫిర్యాదులు రావడంతో నోయిడా పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఈ సైబర్ నేరగాళ్లను( Cyber criminals ) పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఉన్నతాధికారులు నియమించారు.వీరు విస్తృతంగా గాలించి, ఈ నకిలీ వెబ్ సైట్లు సృష్టించి కోట్లాది డబ్బులు కాజేసిన ఆరుగురు సభ్యుల ముఠాను ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.
అదుపులోకి తీసుకున్న వారిని వినీత్ కుమార్, ధృవ్ సోలంకి, గౌరవ్ తలన్, సల్మాన్ ఖాన్, సంతోష్ మౌర్య, మనోజ్ మౌర్యలుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.ముఠా నుంచి మూడు ల్యాప్‌టాప్‌లు, నాలుగు మొబైల్ ఫోన్లు, రెండు డెబిట్ కార్డులు, రూ.11,700 నగదు, హ్యుందాయ్ ఐ10 కారును స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.ఈ ముఠా సభ్యులు యూపీలోని ఘజియాబాద్, గౌతమ్ బుద్ధ్ నగర్‌కు చెందిన వారు.
వీరంతా నకిలీ వెబ్సైట్లు సృష్టించి ఢిల్లీతో పాటు దేశంలోని అనేక ఇతర ప్రాంతాలకు చెందిన వారని మోసగించారు.