సూర్యాపేట జిల్లా:కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు,వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలపై ఏప్రిల్ 5న జరిగే ఛలో ఢిల్లీ కార్యక్రమానికి లక్షలాదిగా తరలిరావాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపెళ్లి సైదులు పిలుపునిచ్చారు.సిఐటియు,రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా చేపట్టిన జీపు ప్రచార జాత శుక్రవారం గరిడేపల్లి మండలానికి చేరుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేరలేదని అన్నారు.
ఏడాదికి కోటి ఉద్యోగాలని చెప్పి, ప్రైవేటీకరణ పేరుతో లక్షలాది ఉద్యోగాలను పీకేస్తున్నారని ఆరోపించారు.నల్లధనం వెలికితీత పేరుతో నోట్లను రద్దు చేసిన బీజేపీ ప్రభుత్వం అంతకంటే పెద్ద నోట్లను ముద్రించి పెద్ద ఎత్తున అవినీతికి తెర లేపారని మండిపడ్డారు.
దశాబ్దాలుగా గ్రామీణ పేదలు పోరాడి సాధించుకున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే దిశగా బడ్జెట్లో నిధులు తగ్గిస్తున్నారని అన్నారు.పెట్రోలు,డీజిల్ నిత్యవసర ధరలు విపరీతంగా పెంచిందని ధ్వజమెత్తారు.
లేబర్ చట్టాల పేరుతో కార్మిక వర్గం సాధించుకున్న అనేక హక్కులను కేంద్రం కాలరాసే విధంగా పార్లమెంటులో చట్టాలు చేసిందన్నారు.వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే విధంగా మూడు నల్ల చట్టాలను తీసుకొచ్చిందని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే మతాల పేరుతో రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న వ్యతిరేక విధానాలపై ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు రాంబాబు, సిఐటియు జిల్లా నాయకులు షేక్ యాకూబ్,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు గుంజ వెంకటేశ్వర్లు,సైదులు, వెంకన్న,కొండలు, రాంబాబు,సైదా,రాములు, సైదులు,రాజు తదితరులు పాల్గొన్నారు.