సూర్యాపేట జిల్లా: రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వం రద్దు చేయడం అన్యాయమని,ఈ చర్య ద్వారా నరేంద్ర మోడీ ప్రభుత్వం దుష్ట సంప్రదాయానికి తెర లేపిందని,ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు లాంటిదని రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వర రావు అన్నారు.రాహూల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వం రద్దును నిరసిస్తూ ఆదివారం సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జిల్లా సేవాదళ్ చీఫ్ ఆర్గనైజర్ ఆలేటీ మాణిక్యం చేపట్టిన నిరసన దీక్షను అయన ప్రారంభించి మాట్లాడుతూ రాహుల్ గాంధీకి జైలు శిక్ష విధించినా,పార్లమెంటు సభ్యత్వం రద్దు చేసినా భయపడేది లేదని,గాంధీ కుటుంబం ఇటువంటి చిల్లర చేష్టలకు భయపడి వెనుకంజ వేసే ప్రసక్తే లేదనిఅన్నారు.
రాహూల్ గాంధీ పార్లమెంటులో మోడీ- అదానీ స్నేహ సంబంధాలు,20 వేల కోట్ల రూపాయల అవినీతి తదితర అంశాలపై లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ముఖం చాటేసి తోక ముడిచిన మోడీ,ఈ పరిస్థితిని ఎదుర్కొనే ధైర్యం లేక రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేయడం పిరికిపంద చర్య అన్నారు.ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకను అణిచివేయాలని అనుకుంటే అది బీజేపీ ప్రభుత్వ తెలివితక్కువ తనంగా భావించవలసి వస్తుందన్నారు.
భారతదేశాన్ని సమైక్యంగా ఉంచడం,ప్రజా సమస్యలపై గళమెత్తడం, అవినీతి లంచగొండితనం రూపుమాపడం,సత్యమే మాట్లాడడం లాంటి అంశాలను ప్రజలలోకి తీసుకువెళ్ళి ప్రజలను చైతన్యవంతులను చేయడం కోసం కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు
రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్ర ద్వారా ప్రజలలో వచ్చిన విశేషమైన స్పందనను జీర్ణించుకోలేక నరేంద్ర మోడీ పన్నిన దుష్ట పన్నాగానికి ఉదాహరణే రాహూల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వ రద్దు అని అన్నారు.ఈ చర్య మోడీ అవలంభిస్తున్న అణిచివేత ధోరణికి పరాకాష్ఠగా అభివ్ణించారు.
త్యాగాల కుటుంబం నుండి వచ్చిన రాహూల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వం రద్దు చేసినా,జైలులో పెట్టినా భయపడే వ్యక్తి కాదనీ,ఎటువంటి కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడినా,ఎన్ని రోజులు జైల్లో పెట్టినా తను నమ్మిన మహాత్మా గాంధీ సిద్ధాంతం సత్యమేవ జయతే ను విడవకుండా ప్రజాస్వామ్య పరిరక్షణకు పోరాటం చేస్తున్న రాహూల్ గాంధీకి దేశ వ్యాప్తంగా సంపూర్ణ మద్దతు లభిస్తుందన్నారు.