అనుమానం అనే వైరస్ ఒక్కసారి కుటుంబంలోకి ప్రవేశిస్తే.కుటుంబం నాశనం అయ్యి కాటికి పోయే వరకు వదలదు.
అనుమానాల వల్ల చాలా కుటుంబాలు అనాధలై రోడ్డున పడ్డాయి.ఒక వ్యక్తి కట్టుకున్న భార్యను గొడ్డలితో అతికిరాతకంగా చంపి.
ఆపై ఆత్మహత్య చేసుకున్న సంఘటన అందోల్ మండలం నాదులాపురంలో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.వివరాల్లోకెళితే.
నాదులాపురంలో ( Nadulapuram ) నివాసం ఉండే ముద్దాయిపేట నారాయణ (55), భార్య మల్లమ్మ (50) లకు ఒక కుమారుడు, కుమార్తె సంతానం.అనుమానం కారణంగా భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరిగేవి.
చుట్టుపక్కల వారు ఎంత సర్ది చెప్పిన గొడవలు తరచుగా జరుగుతూ ఉండడంతో, కుమారుడు నరసింహులు తనతో పాటు గచ్చిబౌలిలో ఉంటే గొడవలు సర్దుమనుగుతాయని తల్లిదండ్రులను హైదరాబాద్ కు తీసుకొచ్చాడు.అయితే ఆదివారం టెక్మాల్ మండలం అచ్చన్న పల్లి గ్రామంలో వివాహ వేడుకలకు హాజరైన దంపతులు, చెల్లెలు మల్లమ్మకు కొత్త బట్టలు పెట్టి ఒడి బియ్యం పోశారు.
చెల్లెలుకు ఒడిబియ్యం పోశాక సొంత ఇంటికి భార్యతో కలిసి వెళ్లాడు నారాయణ.తమ ఇంట్లో అద్దెకు ఉంటున్న అంబమ్మను ఈ ఒక్కరోజు బంధువుల ఇంటికి వెళ్ళమని చెప్పి, నారాయణ దంపతులు సొంత ఇంట్లో పడుకున్నారు.
అర్థరాత్రి భార్యాభర్తల మధ్య గొడవ ప్రారంభమైంది.

క్షణికావేశంలో భార్యను గొడ్డలితో నరికి చంపి తాను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.సోమవారం ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో ఇంట్లో అద్దెకు ఉండే అంబమ్మ వచ్చి తలుపు తట్టగా ఎలాంటి సమాధానం రాకపోవడంతో తలుపు సందులోంచి తొంగి చూస్తే నారాయణ మృతదేహం వేలాడుతూ కనిపించింది.వెంటనే భయంతో చుట్టుపక్కల వాళ్లకు చెప్పగా, అందరూ వచ్చి తలుపులు పగలగొట్టి చూస్తే భార్య భర్తలు రక్తపు మడుగులో విగత జీవులై పడి ఉన్నారు.

పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఇక గ్రామంలోని మహిళలు మద్యాన్ని విచ్చల విడిగా అమ్ముతూ ఉండడంతో నారాయణ మద్యం మత్తులో భార్యను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడని, గ్రామంలో బెల్టు షాపులను అరికట్టాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.సీఐ నాగరాజు పంచాయితీలో తీర్మానం చేసి ఆ పత్రాన్ని తమకు సమర్పించాలని సర్పంచ్ ను కోరారు.మద్యం అమ్మకాలపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.







