తెలంగాణలో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.రెండుసార్లు జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం చెందడాన్ని ఇప్పటికీ కాంగ్రెస్( Congress ) జీర్ణించుకోలేకపోతోంది.
ఏదోరకంగా త్వరలో జరగబోయే తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చేందుకు గట్టిగానే కష్టపడుతోంది.ఇప్పటికే పార్టీకి చెందిన కీలక నేతలంతా పాదయాత్రలు చేపట్టారు.
అలాగే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ( Revanth Reddy )హత్ సే హత్ జోడో యాత్రను నిర్వహిస్తున్నారు.బిజెపి, బీఆర్ఎస్( BJP, BRS ) లకు దీటుగా కాంగ్రెస్ ను జనాల్లోకి తీసుకు వెళ్లే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఒకపక్క పార్టీలో గ్రూపు రాజకీయాలు ఉన్నా.వాటన్నిటిని అధిగమించి అధికారంలోకి పార్టీ తీసుకురావాలనే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా మాణిక్ రావు ఠాక్రే( Manik Rao Thackeray ) బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి ప్రత్యేకంగా ఫోకస్ పెంచారు.

ఇప్పటికే అనేకసార్లు అనుబంధ సంఘాల రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు హాజరైన ఆయన తదుపరి పర్యటనలో కూడా అనుబంధ సంఘాలతో సమావేశాలు నిర్వహించాలని ప్రయత్నిస్తున్నారు.ముఖ్యంగా పార్టీకి అనుబంధంగా పనిచేసే యూత్ కాంగ్రెస్ ఎన్ ఎస్ యు ఐ, ఎస్ సి, ఎస్ టి, బి సి, మైనార్టీ సెల్ తో పాటు, మహిళా కాంగ్రెస్ నేతలతో ఆయన సమావేశాలు నిర్వహించి, వారిలో ఉత్సాహం నింపారు.ఈసారి జరగబోయే పర్యటనలో యూత్ కాంగ్రెస్, టీపీసీసీ ఫిషర్ మెన్ కమిటీలతో సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు.
కాంగ్రెస్ ను క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు అనుబంధ సంఘాల కీలకపాత్ర పోషిస్తాయని మొదటి నుంచి చెబుతున్న మాణిక్ రావు ఠాక్రే తెలంగాణ పర్యటనలో ప్రతిసారి ఆయా అనుబంధ సంఘాల నేతలతో ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు.

క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీల ఏర్పాటు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తదితర అంశాల పైన ఫోకస్ పెంచి ప్రజా పోరాటాలు చేపట్టాలని,యూత్ కాంగ్రెస్ ,ఫిషర్మన్ కాంగ్రెస్ నేతలకు జరగబోయే సమావేశంలో దిశా నిర్దేశం చేయబోతున్నారట.ప్రస్తుతం నాలుగు రోజుల పాటు తెలంగాణలో మాణిక్ రావు ఠాక్రే పర్యటించనున్నారు.ఈనెల 23న హైదరాబాద్ కు రాబోతున్న ఆయన 26 వరకు ఇక్కడే మకాం వేస్తారు.23వ తేదీన పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ,జోడో యాత్రల ఇన్చార్జిల తో ఆయన భేటీ కాబోతున్నారు.24న యూత్ కాంగ్రెస్ నేతలతో సమావేశం అవుతారు.25న పార్టీ కీలక సమావేశాన్ని నిర్వహిస్తారు.26న ఖమ్మంలో రేణుక చౌదరి ఆధ్వర్యంలో జరగబోయే హాథ్ సే హాథ్ జోడో యాత్రలో ఆయన పాల్గొననున్నారు.







