మరికొన్ని గంటల్లో జనసేన ఆవిర్భావ సభ మొదలు కాబోతోంది.ఈ సభను భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో జనసేన కార్యకర్తల్లో ఉత్సాహం పెంచే విధంగా భారీగా ఈ సభను ఏర్పాటు చేస్తున్నారు.కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఈ మేరకు సభా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు, మరి కొంతమంది కీలక నేతలు మాట్లాడబోతున్నారు.జనసేన ఆవిర్భవించి ఈరోజుకు తొమ్మిదేళ్లు పూర్తవుతుంది.
పదో సంవత్సరంలోకి అడుగుపెడుతోంది.ఈ ఆవిర్భావ సభకు ఏపీతో పాటు , తెలంగాణ నలుమూలల నుంచి భారీగా జనసేన కార్యకర్తలు వస్తున్నారు.
ఎక్కడకక్కడ వాహనాలు సిద్ధమయ్యాయి.
మొత్తం సభ ఏర్పాట్లను జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ చూస్తున్నారు.
ఈ సభ ను 35 ఎకరాల్లో ఏర్పాటు చేశారు.దాదాపు 100 ఎకరాల్లో సభ పార్కింగ్ ఏర్పాట్లు చేశారు.
ఈ సభకు పొట్టి శ్రీరాములు పుణ్య వేదికని పేరు పెట్టారు.ఈ సభ నిర్వహించే స్థలానికి రైతులు అనుమతి ఇచ్చారు.
ఈ సభ ప్రాంగణంలో 10 గ్యాలరీలు, భారీగా స్క్రీన్ లను ఏర్పాటు చేశారు.సభకు వచ్చే కార్యకర్తలకు భోజన ఏర్పాట్లను, పార్కింగ్ స్థలంలోనే ఒకవైపున ఏర్పాటు చేశారు.
ఈ సభకు వచ్చే వారికి ఇబ్బంది కలగకుండా మజ్జిగ ప్యాకెట్లను కూడా అందించబోతున్నారు.

అలాగే ఆవిర్భావ సభకు వచ్చిన వారు ఎవరైనా అనారోగ్యానికి గురైతే వెంటనే వారికి వైద్య సహాయం అందించేందుకు వీలుగా అనేకమంది డాక్టర్లతో పాటు, 8 అంబులెన్స్లను సిద్ధం చేశారు.ఇక ఈ సభలో పాల్గొనేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి వాహనంలో విజయవాడ ఆటోనగర్ నుంచి మచిలీపట్నానికి బయలుదేరుతారు.సాయంత్రం ఐదు గంటలకు సభ స్థానానికి చేరుకుంటారు.
రాత్రి 9 గంటల వరకు సభ ఉంటుంది.పవన్ కళ్యాణ్ రాక కోసం విజయవాడ బందర్ మధ్య భారీగా స్వాగత ఏర్పాట్లు అభిమానులు చేపట్టారు.
ఇదిలా ఉంటే ఈ సభలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు అనేది ఆసక్తికరంగా మారింది.

ఎన్నికల సమయం దగ్గరకు వస్తున్న నేపథ్యంలో పొత్తులపై క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.జనసేన, టిడిపి వైపు వెళుతుందనే అనుమానాలు జనాలతో పాటు, కార్యకర్తలలోను ఉండడంతో, పవన్ దీనిపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా జనసేన వర్గాలు పేర్కొంటున్నాయి .అలాగే కొన్ని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక పైన ప్రసంగం ఉండబోతుందట.దీంతో పాటు ఏపీ అధికార పార్టీ వైసిపి విధానాల పైన, జనసేన ను రానున్న రోజుల్లో ఏవిధంగా ముందుకు తీసుకువెళ్తాము అనే అంశాల పైన పవన్ క్లారిటీగా మాట్లాడబోతున్నట్లు తెలుస్తోంది.







