సాధారణంగా మెట్ట భూములు అనేసరికి చాలామంది వ్యవసాయం చేయడానికి సాహసించరు.ఎందుకంటే అవి ఏదైనా తోటలు వేయడానికే తప్ప, వ్యవసాయానికి అంతగా అనుకూలంగా వుండవు కనుక.
అయితే అలాంటి మెట్టభూముల్లో కూడా సాగు విధానాలను ప్రోత్సహించి.సన్న, చిన్నకారు రైతులకు లాభం చేకూరేలా ఇక్రిసాట్ సంస్థ పరిశోధనలు జరుపుతోంది.
ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన ఓ వ్యవసాయ పరిశోధన సంస్థతో కలిసి మెట్ట భూముల్లో సాగుకు అనుకూలంగా “ప్లాస్మా వాటర్” టెక్నాలజీపై అధ్యయనం చేసేందుకు కసరత్తులు చేస్తోంది.ఇప్పటికే పరిశోధకులు వివిధ దశల్లో ఉన్న మొక్కల జీవన కాలానికి అనుగుణంగా ప్లాస్మా అప్లికేషన్లను ప్రయోగాత్మకంగా ఉపయోగించి ఫలితాలను రాబట్టుతున్న విషయం తెలిసినదే.
కాగా ఈ ప్రయోగం కూడా విజయవంతం అవుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్లాస్మా వాటర్ కంపెనీలతో కుదిరిన ఒప్పందం ప్రకారం దేశంలోని మెట్ట భూముల్లో వ్యవసాయాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా పనిచేయబోతాము అని అన్నారు.

ఇకపోతే ప్లాస్మా వాటర్ అంటే ఏమిటంటే… గాలి, నీరు, విద్యుత్తు సాయంతో నీటిని ప్లాస్మైజ్డ్ వాటర్‌గా మార్చి మొక్కకు అందించే టెక్నాలజీని ప్లాస్మా వాటర్ అని అంటారు.ఈ విధానంలో పేటెంట్ కలిగిన ప్లాస్మా చాంబర్ ద్వారా నీటిని పంపు చేస్తారు.ఈ నీటిలో ఎలాంటి సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా మనుగడ సాగించలేదు.పూర్తిగా రియాక్టివ్ ఆక్సిజన్‌తోపాటు నైట్రోజన్ పరమాణువులను కలిగి ఉంటుంది.గింజలు, మొక్కల్లో రోగ నిరోధక వ్యవస్థను ఈ ప్లాస్మా వాటర్ బలపరుస్తుంది.ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా దీనిపై విస్తృతంగా అధ్యయనం చేసి విజయాలు సాధిస్తున్నారు.
ఎందుకంటే ఈ విధానం మనదేశంలో కూడా ప్రవేశపెట్టాలని కేంద్రం కసరత్తులు చేస్తోంది.ఈ ప్లాస్మా వాటర్ టెక్నాలజీతో మరో విశేషమైన లాభం ఏమంటే….
దీని వలన సాగు నిర్వహణ భారం తగ్గడంతో పాటు రసాయనిక ఎరువుల వినియోగం కూడా విరివిగా తగ్గుతుంది.అంతేకాకుండా సేంద్రియ ఉత్పత్తులను పొందేందుకు అవకాశం ఉన్నదని ఇక్రిసాట్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేసాయి.







