ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడే కొద్ది, రాజకీయ సమీకారణాల్లో శరవేగంగా మార్పులు చేర్పులు చేసుకుంటున్నాయి.అలాగే ఒక పార్టీ నుంచి మరో పార్టీకి వలసలు మొదలయ్యాయి.
ఇదేవిధంగా టిడిపిలో పెద్దగా యాక్టివ్ గా లేకుండా, సైలెంట్ గా ఉంటున్న విజయవాడ కీలక నేత దివంగత వంగవీటి మోహన్ రంగ కుమారుడు వంగవీటి రాధాకృష్ణ 2024 ఎన్నికల్లో జనసేన నుంచి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారని, ఈ మేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నుంచి రాధాకు భరోసా వచ్చిందని, త్వరలోనే ఆయన జనసేన లో చేరుతారని ప్రచారం పెద్ద ఎత్తున సాగింది.ఈనెల 14వ తేదీన మచిలీపట్నంలో జరగబోయే జనసేన ఆవిర్భావ సభలోనే రాధా పార్టీలో చేరుతున్నట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండగానే , అకస్మాత్తుగా వంగవీటి రాధా తన అనుచరులతో కలిసి నారా లోకేష్ చేస్తున్న యువ గళం పాదయాత్రలో పాల్గొన్నారు.
తన అనుచరులతో రాధాకృష్ణ లోకేష్ పాదయాత్రలో కొద్దిసేపు నడిచారు. అనంతరం పాదయాత్ర విరామ సమయంలో లోకేష్ తో ప్రత్యేకంగా సమావేశమైన ఆయన తాజా రాజకీయ అంశాల గురించి లోకేష్ తో చర్చించారు. తాను పార్టీ మారడం లేదని టిడిపిలోనే కొనసాగుతాననే విషయాన్ని రాధ చెప్పినట్లుగా ప్రచారం జరుగుతుంది.
అయితే రాధ జనసేన లో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని, టిడిపి అధినేత చంద్రబాబు నేరుగా రాధకు ఫోన్ చేసి టిడిపిలోని ఉండాలని, రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇవ్వడమే కాకుండా, గెలిపించే బాధ్యత తమదని హామీ ఫోన్ ద్వారా ఇవ్వడంతోనే, ఆయన తన మనసు మార్చుకుని ఇప్పుడు లోకేష్ పాదయాత్రలో పాల్గొనడం ద్వారా తాను పార్టీ మారడం లేదనే సంకేతాలను ఇచ్చినట్లుగా అర్థమవుతుంది.దీంతో ఇప్పటివరకు రాధ జనసేనలో చేరుతారని ఆశగా ఎదురుచూస్తున్న జనసేన కార్యకర్తలకు ఈ పరిణామాలు మింగుడు పడటం లేదట.