సూర్యాపేట జిల్లా:ఓట్లు కాదు నాకు ముఖ్యం సూర్యాపేట అభివృద్ధి ప్రధానమని భావించి రోడ్ల వెడల్పుకు పూనుకొని సూర్యాపేటను అభివృద్ధి పథంలో నడిపిస్తూ తెలంగాణ రాష్ట్రానికే తలమానికం చేసిన ఘనత రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డికే దక్కుతుందని బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు రాపర్తి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.సోమవారం స్థానిక ఎస్ఆర్ఎన్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడుగా కొనసాగుతున్న తాను ఆ పార్టీకి,జిల్లా ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
గత పది సంవత్సరాల కాలంలో సూర్యాపేట జిల్లాతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న మంత్రి జగదీష్ రెడ్డి అభివృద్ధికి ఆకర్షితుడినై త్వరలో బిఆర్ఎస్ లో మంత్రి జగదీశ్ రెడ్డి సమక్షంలో చేరనున్నట్లు తెలిపారు.సూర్యాపేట నియోజకవర్గ చరిత్రలో సూర్యాపేటను అభివృద్ధి చేసిన నాయకుడు జగదీశ్ రెడ్డి మాత్రమేనని,కళ్లకు కనబడుతున్న అభివృద్ధిని కాదనలేమని మూసి మురికి కూపం నుండి విముక్తి కల్పించి, స్వచ్ఛమైన జలాలను అందించి,ప్రతి మండలంలో చివరి ఆయకట్టు వరకు గోదావరి జలాలతో సాగునీరు అందించి సస్యశ్యామలం చేశాడన్నారు.
సూర్యాపేట నియోజకవర్గంలో ఎంతోమంది శాసనసభ్యులు పనిచేసినా కూడా కనీసం ప్రభుత్వ డిగ్రీ కళాశాల తేలేకపోయారని, కానీ,ఎవరూ ఊహించని విధంగా మెడికల్ కాలేజీని తెచ్చిన ఘనత జగదీశ్ రెడ్డి అన్నారు.