అదేంటి, పిల్లికి కూడా బిచ్చం వేయని సూపర్ మర్కెట్స్ వ్యాపారులు సూపర్ మార్కెట్లోని వస్తువులను ఫ్రీగా ఇచ్చేయడమా? మేము నమ్మం! అని అంటారా? అయితే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే.ఈ ఘటన మనదగ్గర కాదు లెండి.
మన దగ్గర జరిగే అవకాశమే లేదు కదా! అసలు విషయంలోకి వెళితే….టర్కీ, సిరియాలో ఇటీవల సంభవించిన భూకంపాల ధాటికి లక్షలాది మంది ప్రజలు ఆహారం కోసం అలమటిస్తున్న సంగతి విదితమే.
అక్కడి భూకంపం ధాటికి ఇప్పటివరకు 46,000 మంది ప్రాణాలు కోల్పోయారని సమాచారం.

ఈ క్రమంలోనే అక్కడి ప్రజలను ఆదుకునేందుకు అనేక దేశాలు సాయం చేస్తున్నాయి.అందులో మన భారతదేశం కూడా వుంది.భూకంపం సంభవించిన సమయంలో టర్కీలో ఓ సూపర్ మార్కెట్ యజమాని తమ వద్ద ఉన్న సరుకులన్నింటినీ బాధితులకు ఉచితంగా ఇవ్వడం అతని దాతృత్వాన్ని చాటి చెబుతుంది.
కాగా ఇందుకు సంబంధించిన విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా నెటిజన్లు అతన్ని ఆకాశానికెత్తేస్తున్నారు.“నా సూపర్ మార్కెట్ నుంచి ఏది కావాలంటే అది ఫ్రీగా తీసుకెళ్లండి.
నేను ఇప్పటికే ఈ షాపు ద్వారా కావాల్సినంత సంపాదించాను” అని ఆ సూపర్ మార్కెట్ యజమాని చెప్పడం గమనార్హం.

భూకంపం నేపథ్యంలో ఆ సూపర్ మార్కెట్ యజమాని చూపిన మానవత్వానికి అక్కడి ప్రజలు జేజేలు పలుకుతున్నారు.అతడిని, అతడి కుటుంబాన్ని దేవుడు చల్లగా చూడాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.సూపర్ మార్కెట్లో ఉన్న సరుకులను స్వచ్ఛంద సంస్థ వారు, స్థానికులు తీసుకెళ్తుండడం ఈ వీడియోలో స్పష్టంగా చూడవచ్చు.
కాగా, అక్కడ భూకంపం ధాటికి ప్రాణాలు పోవడమే కాకుండా చాలా మంది మృత్యువుతో పోరాడుతున్నారు.ఇక ఆస్తి నష్టం అయితే ఏమేర జరిగిందో ఊహకే అందదు.








