ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అప్పుడే టికెట్లు పంచాయతీ తెలుగుదేశం పార్టీలో మొదలైపోయింది.ఇప్పటికే చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల పైన సమీక్ష నిర్వహించారు.
సర్వే రిపోర్టులు తెప్పించుకున్నారు.దీనికి అనుగుణంగా ఒక్కో నియోజకవర్గానికి పార్టీ అభ్యర్థులను ముందుగానే ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు.
ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేశారు. జనసేనతో పొత్తు పై క్లారిటీ వచ్చిన తర్వాత సీట్ల పంపకం విషయంలో ఒక అంగీకారం వచ్చిన తరువాత , జనసేనకు ఇచ్చే సీట్లు మినహా మిగిలిన అన్ని స్థానాల్లోనూ అభ్యర్థులను ముందుగానే ప్రకటించేందుకు బాబు సిద్ధమవుతుండగా , టిడిపి సీనియర్లు మాత్రం పలానా నియోజకవర్గం లో పలానా అభ్యర్థి ఉండాలంటూ అప్పుడే అలకలు, హెచ్చరికలు మొదలుపెట్టారు.
టిడిపి మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఈ తరహా హెచ్చరికలతో కూడిన వినతిని బాబుకు ఇచ్చారు.అసలు రాయపాటి సాంబశివరావు ఈ స్థాయిలో ఫైర్ అవడానికి కారణం నరసరావుపేట ఎంపీ సీటు పుట్టా మహేష్ అనే వ్యక్తికి ఇవ్వబోతున్నారనే సంకేతాలు రావడమే కారణం.

ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాయపాటి ఈ వ్యాఖ్యలు చేశారు.తాను ప్రత్యక్ష రాజకీయాల్లో ఇక పాల్గొననని , తన వారసుడు రంగారావుకు సీటు ఇవ్వాలని ఇప్పటికే చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్ళానని రాయపాటి చెప్పుకొచ్చారు.నరసరావుపేట ఎంపీ లేదా ఎమ్మెల్యే, సత్తెనపల్లి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గాల్లో ఏదో ఒకటి తన వారసుడికి ఇవ్వాలని బాబు ను కోరినట్లు రాయపాటి తెలిపారు.అయితే నరసరావుపేటలో వైసిపి సిట్టింగ్ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిని ఎదుర్కోవడం అక్కడ ఇన్చార్జి అరవింద్ బాబు వల్ల కాదని పార్టీ లో టాక్ నడుస్తోంది.
దీంతో ఇక్కడ అభ్యర్థిని మారుస్తారని ప్రచారం జరుగుతుంది.ఇక సత్తెనపల్లి నియోజకవర్గానికి వస్తే ఇక్కడ టిడిపి ఇన్చార్జి గా ఎవరిని నియమించలేదు.కానీ ఇక్కడ టికెట్ ను ఆశిస్తూ కోడెల శివరాం, చలపతి విద్యాసంస్థల అధినేత వైవి ఆంజనేయులు , పోటా పోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.దీనిపైన చంద్రబాబు నిర్ణయం తీసుకోలేదు.

గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నలుగురు అభ్యర్థులు పోటీపడుతున్నారు. కోవెలమూడి రవీంద్ర , భాష్యం ప్రవీణ్ , మన్నవ మోహన్ కృష్ణ తో పాటు డాక్టర్ శేషయ్య ఈ సీటుపై ఆశలు పెట్టుకున్నారు.ఇక రాయపాటి సాంబశివరావు తన కుమారుడు రంగారావుకు ఖచ్చితంగా నరసరావుపేట ఎమ్మెల్యే లేదా ఎంపీ ఇవ్వాలని అధినేతపై ఒత్తిడి పెంచుతున్నారు.అయితే టిడిపి సీనియర్ యనమాల రామకృష్ణుడు తన అల్లుడు పుట్టా మహేష్ యాదవ్ కు నరసరావుపేట ఎంపీ సీటు ఇవ్వాలని చంద్రబాబు పై ఒత్తిడి చేస్తున్నారు.
అయితే పుట్ట మహేష్ విషయంలో నరసరావుపేట పార్లమెంట్ స్థానంలో ఉన్న అసెంబ్లీ ఇన్చార్జీలు ఎవరూ సానుకూలంగా స్పందించడం లేదు.ఇప్పటికే నాన్ లోకల్ అభ్యర్థిని ఇక్కడ ఎలా పోటీకి దింపుతారు అంటూ రాయపాటి గరం గరం అవుతుండడంతో , చంద్రబాబు కూడా ఈ వ్యవహారాలపై నోరు మెదపలేని పరిస్థితి నెలకొంది.







