టిడిపి ఎమ్మెల్యేగా 2019 ఎన్నికల్లో గెలిచిన గంటా శ్రీనివాసరావు అప్పటినుంచి ఆ పార్టీలో ఉన్నా.లేనట్టుగానే వ్యవహరిస్తూ వస్తున్నారు.
అప్పుడప్పుడు తన రాజకీయ ఉనికి కాపాడుకునేందుకు వివిధ ప్రకటనలు చేస్తున్నారు.టిడిపి నిర్వహించే ఏ కార్యక్రమంలోనూ ఆయన పాల్గొనకుండా, స్వతంత్ర ఎమ్మెల్యే మాదిరిగా వ్యవహరిస్తూ వచ్చారు.
అయినా టిడిపి అధిష్టానం గంటా విషయంలో ఎటువంటి చర్యలు తీసుకునేందుకు సాహసించలేదు.దీనికి కారణం గంటా కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతోపాటు, ఉత్తరాంధ్ర ప్రాంతంలో కీలక నేతగా , చాలా నియోజకవర్గాల్లో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో గంటా శ్రీనివాసరావుకు బలం బలగం ఉండడమే కారణం .
ఆయన పార్టీ విషయంలో ఈ విధంగా వ్యవహరిస్తున్న, టిడిపి అధిష్టానం సైలెంట్ గానే చూస్తూ వస్తోంది .దీంతో 2024 ఎన్నికల్లో గంటా కు టిడిపి నుంచి టికెట్ దక్కడం అనుమానమే అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్న నేపథ్యంలో, తాజాగా గంటా శ్రీనివాసరావు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో హైదరాబాద్ లో భేటీ అయ్యారు.

దాదాపు 40 నిమిషాల పాటు లోకేష్ గంటా మధ్య చర్చలు జరిగాయి.హైదరాబాదు వచ్చిన గంట శ్రీనివాసరావు జూబ్లీహిల్స్ లోని లోకేష్ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా తాను ఎందుకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాల్సి వస్తోంది వంటి అన్ని విషయాలను లోకేష్ కు వివరించినట్లు సమాచారం.లోకేష్ తో భేటీ సందర్భంగా తాను ఎదుర్కొంటున్న అన్ని ఇబ్బందులను స్పష్టంగా ఆయన వివరించారట.

దీనికి లోకేష్ నుంచి కూడా సానుకూల స్పందన రావడంతో ఇక ముందు ముందు టిడిపి కార్యక్రమాల్లో గంటా శ్రీనివాసరావు పాల్గొంటారని, యాక్టివ్ గా పార్టీ కార్యక్రమాలు చేపడతారని టిడిపి నాయకులు అభిప్రాయ పడుతున్నారు.2019 ఎన్నికల తర్వాత పార్టీలో గంటా క్రియాశీలకంగా లేరు.విశాఖ నార్త్ నుంచి ఆయన పోటీ చేసి గెలిచారు.ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గరనుంచి వైసీపీలో చేరేందుకు అనేక ప్రయత్నాలు చేసినా, ఆ పార్టీ అధిష్టానం నుంచి సానుకూలత రాకపోవడంతో సైలెంట్ గానే ఉండిపోయారు.
లోకేష్ తో తాజాగా భేటీ అయిన తర్వాత గంటా శ్రీనివాసరావు ఉత్సాహంగా కనిపిస్తుండడంతో టిడిపి కేడర్ లోనూ ఉత్సాహం కనిపిస్తోంది.







