ఎన్ఆర్ఐలపై ప్రశంసల వర్షం కురిపించారు ప్రధాని నరేంద్ర మోడీ.మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో 17వ ప్రవాసీ భారతీయ దివాస్ సదస్సును మోడీ సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.మేకిన్ ఇండియాకు ప్రవాసులు బ్రాండ్ అంబాసిడర్లని అన్నారు.
మనదేశం నుంచి విదేశాలకు వలస వెళ్లిన భారతీయులు.భారతదేశ నిర్మాణంలో కీలకపాత్ర పోషించారని మోడీ ప్రశంసించారు.అలాంటి వారి విజయాలను డాక్యుమెంట్‌గా రూపొందించి విద్యార్ధులకు అందించాలని యూనివర్సిటీలకు ప్రధాని సూచించారు.జీ20 ప్రెసిడెన్సీ ఈ ఏడాది భారత్‌కు వచ్చిందని ఆయన తెలిపారు.
యెగా, ఆయుర్వేదం, కుటీర పరిశ్రమలు, హస్తకళలు, చిరుధాన్యాల విషయంలో ప్రవాసులు దేశానికి బ్రాండ్ అంబాసిడర్లని ప్రధాని ప్రశంసించారు.భారతదేశం గురించి మరింత తెలుసుకోవాలనే ప్రపంచ కోరికను పరిష్కరించే వ్యక్తులు మీరేనంటూ ఆయన కొనియాడారు.
ఇవాళ ప్రపంచం భారతదేశం వైపు ఎంతో ఆసక్తిగా చూస్తోందని ప్రధాని అన్నారు.వచ్చే 25 ఏళ్లలో భారతదేశ అభివృద్ధి ప్రణాళికల్లో ప్రవాసులకు ముఖ్యమైన స్థానం వుందని మోడీ పేర్కొన్నారు.

ప్రపంచవేదికపై నేడు భారతదేశ గొంతుకకు, సందేశానికి భిన్నమైన ప్రాముఖ్యత వుందని ఆయన అన్నారు.రాబోయే రోజుల్లో ఇండియా బలం మరింత పెరుగుతుందని మోడీ పేర్కొన్నారు.భారతదేశ సంస్కృతి, సంప్రదాయం మాత్రమే కాకుండా దేశ పురోగతిని కూడా మెరుగుపరచాలని ప్రధాని పిలుపునిచ్చారు.

ఇకకోవిడ్ మహమ్మారిపై భారతదేశం పోరాటాన్ని ప్రధాని మోడీ ప్రస్తావించారు. 220 కోట్ల ఉచిత వ్యాక్సిన్ డోస్‌ల పంపిణి, తేజస్ యుద్ధ విమానం, అణు జలాంతర్గామి అరిహంత్, విమాన వాహక నౌక విక్రాంత్ వంటి హైటెక్ డిఫెన్స్ ఫ్లాట్‌ఫారమ్‌ల అభివృద్ధి గురించి మోడీ మాట్లాడారు.అలాగే గ్లోబల్ రియల్ టైమ్ డిజిటల్ లావాదేవీలలో భారతదేశం 40 శాతం వాటాను కలిగి వుందన్నారు.అంతరిక్షం, సాఫ్ట్‌వేర్, డిజిటల్ టెక్నాలజీలలో కూడా భారతదేశ నైపుణ్యం పెరుగుతోందని మోడీ పేర్కొన్నారు.20 అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థల సమూహమైన జీ20కి అధ్యక్ష పదవి భారత్‌కు దక్కడం గురించి కూడా ప్రధాని మాట్లాడారు. భారతదేశ విజయాల గురించి ప్రపంచానికి చెప్పడానికి ఇది ఒక అవకాశం అని ఆయన అన్నారు.జీ 20 అనేది కేవలం దౌత్య కార్యక్రమం మాత్రమే కాదని, ప్రజల భాగస్వామ్యంతో ఒక చారిత్రాత్మక ఉద్యమం అని మోడీ చెప్పారు.







