దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు వీలుగా భారత రాష్ట్ర సమితి పేరుతో జాతీయ పార్టీని ఏర్పాటు చేసిన కేసిఆర్ కు జాతి స్థాయిలో ఆ చక్రం తిప్పకుండానే ఇప్పుడు సొంత రాష్ట్రం లోని బీఆర్ఎస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తుంది.పూర్తిస్థాయిలో జాతీయ రాజకీయాలపై దృష్టి సారించి , దేశవ్యాప్తంగా బిజెపి కి వ్యతిరేకంగా తమతో కలిసి వచ్చే అన్ని పార్టీలను కలుపుకొని వెళ్లి , కేంద్రంలో అధికారంలోకి రావాలని చూస్తున్న కేసిఆర్ కు ఇప్పుడు సొంత రాష్ట్రంలోని, సొంత పార్టీ నేతల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట.
దీనికి కారణం మల్కాజ్ గిరి, షేర్ లింగంపల్లి, కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, ఉప్పల్ తదితర నియోజకవర్గాల్లో మంత్రి మల్లారెడ్డి చేస్తున్న వ్యవహారాలే కారణమట.మంత్రి మల్లారెడ్డి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ, తమ నియోజకవర్గంలో వేలుపెడుతూ, గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తుండడంపై చాలామంది ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట.
ముఖ్యంగా మంత్రికి జిల్లా ఎమ్మెల్యేలకు మధ్య దూరం పెరిగిందని, మల్లారెడ్డికి కేసీఆర్ కు ఎక్కువ ప్రాధాన్యమిస్తూ, తమను పట్టించుకోవడంలేదనే బాధతో మీడియా ముందుకు వచ్చి మరి తమ అసంతృప్తిని వ్యక్తం చేయడం చర్చనీయాంశం గా మారింది.
ముఖ్యంగా మంత్రి మల్లారెడ్డి , మైనంపల్లి హనుమంతరావు మధ్య నామినేటెడ్ పదవుల పంపకం విషయంలో విభేదాలు తలెత్తడం బీఆర్ఎస్ లో కాక రేగుతోంది.
ఈ వ్యవహారం ఇలా ఉండగానే మల్లారెడ్డి పై అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలంతా సమావేశం కావడం ఆసక్తి రేపుతుంది. ముఖ్యంగా మేడ్చల్ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ నియామకం విషయంలో ఈ విభేదాలు బయటకు వచ్చాయి.
ఇప్పటివరకు చైర్మన్ గా ఉన్న కుత్బుల్లాపూర్ నియోజక వర్గానికి చెందిన రవి యాదవ్ పదవీకాలం పూర్తి కావచ్చిన నేపథ్యంలో, ఆ పదవిని భర్తీ చేసే విషయంలో మంత్రికి ఎమ్మెల్యేలకు మధ్య వివాదం మొదలైంది.మంత్రి తన నియోజకవర్గానికి చెందిన వారికి పదవులు ఇప్పించుకుంటున్నారంటూ ఎమ్మెల్యేలు సైతం కేటీఆర్ దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లారు.
దీనిపై చర్చించి తగిన నిర్ణయం తీసుకుందామని కేటీఆర్ హామీ కూడా ఇచ్చారు.అయితే ఈలోపునే మంత్రి మల్లారెడ్డి మేడ్చల్ కు చెందిన భాస్కర్ యాదవ్ కు హడావుడిగా నిన్న మంత్రి నిరంజన్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రం ఇప్పించారు.

ఈరోజు ఉదయం ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించాలని ఆదేశించారు.దీంతో విషయం తెలిసిన జిల్లా ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా భేటీ అయ్యి మంత్రి మల్లారెడ్డి వ్యవహారంపై చర్చించినట్లు సమాచారం.మంత్రి మల్లారెడ్డి వ్యవహారం ఇటీవల కాలంలో వివాదాస్పదం కావడం, జిల్లా ఎమ్మెల్యేలతోనూ సఖ్యత లేకపోవడం, ఆయన కారణంగా పార్టీలో క్రమశిక్షణ లోపించి, గ్రూపు రాజకీయాలు పెరిగే అవకాశం కనిపించడంతో టిఆర్ఎస్ అధిష్టానం కూడా మల్లారెడ్డి విషయంలో అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.







