తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతల వ్యవహారం ఆ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.ముఖ్యంగా ఇటీవల ప్రకటించిన తెలంగాణ కాంగ్రెస్ కమిటీలలో సీనియర్ నాయకులకు సరైన ప్రాధాన్యం దక్కకపోవడం, రేవంత్ రెడ్డి వర్గంగా చెప్పుకుంటున్న వారికి కీలక పదవులు దక్కడంతో కాంగ్రెస్ అధిష్టానం వైఖరి పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.
ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించడం హాట్ టాపిక్ గా మారింది.మొదటి నుంచి రేవంత్ రెడ్డి ని వ్యతిరేకిస్తూ వస్తున్న సీనియర్ కాంగ్రెస్ నేతలంతా ఇప్పుడు ఏకతాటిపైకి వచ్చి సమావేశం కావడం , రానున్న రోజుల్లో రేవంత్ వర్గానికి ఎక్కువ ప్రాధాన్యం అధిష్టానం ఇవ్వబోతుందనే సంకేతాల పైన వారు చర్చించుకున్నారట.
ఈ క్రమంలోనే కాంగ్రెస్ నాయకులంతా మూకుమ్మడిగా పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది. ఇటీవల ప్రకటించిన కాంగ్రెస్ కొత్త కమిటీలలో దాదాపు 50 శాతానికి పైగా టిడిపి నుంచి వచ్చిన వారేనని, వారంతా రేవంత్ వర్గీయులేనని మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్నారు.
వాస్తవంగా ఇటీవల ప్రకటించిన కమిటీలలో పదవులు పొందిన వారు 196 మంది ఉంటే, అందులో 12 మంది మాత్రమే ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు ఉన్నారు .వారు కూడా గత రెండేళ్లుగా కాంగ్రెస్ కోసం తమ స్థాయిలో కష్టపడుతున్నారు.అయితే వారందరి పైన సీనియర్లు ఆగ్రహంతో ఉన్నారు .ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కమిటీలలో స్థానం దక్కడం , తమకు అవకాశం కల్పించకపోవడంపై రగిలిపోతున్నారు .
ఈ క్రమంలోనే రేవంత్ వర్గానికి ముందు ముందు మరింత ప్రాధాన్యం కల్పిస్తే , తామంతా పార్టీని వీడి బిజెపిలోకి వెళ్లేందుకు ఏమాత్రం వెనకాడబోము అనే సంకేతాలను అధిష్టానం పెద్దలకు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.అయితే సీనియర్ నాయకులకు నమ్ముకోవడం కన్నా , రేవంత్ ను నమ్ముకోవడం వల్ల తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురాగలమని ఆ పార్టీ అధిష్టానం బలంగా నమ్ముతుండడంతోనే, సీనియర్ల హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోనట్టుగా వ్యవహరిస్తోందట.