బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III బెడ్‌ఫోర్డ్‌షైర్‌లోని లుటన్‌లో నూతనంగా నిర్మించిన గురుద్వారాను మంగళవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా సిక్కు భక్తుడి మాదిరిగా తలకు కర్చీఫ్ కట్టుకుని గురుద్వారా మొత్తం కలియదిరిగారు.
గురుద్వారా సభ్యులు, వాలంటీర్లను ఆయన అప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు.అలాగే లుటన్ ఏరియాలో సిక్కు కమ్యూనిటీ కోసం స్కూల్‌ను నడుపుతున్న నిర్వాహకులతోనూ కింగ్ చార్లెస్ ముచ్చటించారు.
ఈ క్రమంలో పంజాబీ, సంప్రదాయ సంగీతం నేర్చుకుంటున్న స్కూల్ చిన్నారులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు.

అయితే కింగ్ చార్లెస్ సాధారణ సిక్కు భక్తులతో కలిసి నేలపై కూర్చొని ప్రార్ధనలు చేయడం ఆకట్టుకుంది.అలాగే గురుద్వారాలోని లంగర్‌ను సందర్శించి .అక్కడ రోటీలు తయారు చేస్తున్న మహిళలతో ముచ్చటించారు.గురుద్వారా ఆవరణలోని లుటన్ సిక్ సూప్ కిచెన్ ఆయనను ఆకట్టుకుంది.ఇది 365 రోజులూ వేడి వేడి వెజిటేరియన్ మీల్స్‌ను అందిస్తుందని నిర్వాహకులు చెప్పడంతో కింగ్ చార్లెస్ హర్షం వ్యక్తం చేశారు.
ఆయన గురుద్వారా సందర్శించిన ఫోటోలను బ్రిటీష్ రాయల్ ఫ్యామిలీ సోషల్ మీడియాలో షేర్ చేసింది.ప్రస్తుతం ఇవి వైరల్ అవుతున్నాయి.

కాగా… ఈ గురుద్వారా నిర్మాణ పనులు 2020లో ప్రారంభమయ్యాయి.స్థానిక విరాళాల మద్ధతుతో నిర్మించబడిన ఈ గురుద్వారాను… 37 మీటర్ల పొడవు, 32 మీటర్ల వెడల్పుతో మూడు అంతస్తుల్లో సుందరంగా తీర్చిదిద్దారు.ఇక్కడి గురుద్వారాలోని లంగర్ రోజుకు దాదాపు 500 మందికి భోజనాలను అందిస్తోంది.స్థానిక సిక్కు సంఘం సైతం ప్రతి ఆదివారం టౌన్‌హాల్ వద్ద లూటన్ సిక్కు సూప్ కిచెన్‌ను నిర్వహించడంతో పాటు 150 మందికి భోజనాలను అందిస్తోంది.