ఏపీలో అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది.సార్వత్రిక ఎన్నికలకు సమయం ఇంకా ఉన్న, ఏపీలో ముందస్తు ఎన్నికల వస్తాయి అన్న హడావుడి నెలకొంది.
కచ్చితంగా వైసీపీ ముందస్తు ఎన్నికలకు వెళ్తుందని, టిడిపి, జనసేన ప్రచారం మొదలుపెట్టాయి.అందుకే జగన్ వ్యవహాత్మకంగా జనాల్లోకి వెళ్తూ, సభలు, సమావేశాలు నిర్వహిస్తూ , కులాల వారీగా మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారని భావిస్తూ, తాము కూడా ఎన్నికలకు సిద్ధం అంటూ సవాల్ చేస్తూ జనాలు బాట పట్టాయి.
అందుకే వివిధ ఆందోళన కార్యక్రమాలు, వైసిపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై గట్టిగానే పోరాటం మొదలుపెట్టింది.ఇక వైసిపి కూడా విపక్షాలకు ఎక్కడ అవకాశం లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తూ ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తోంది.
ముఖ్యంగా టిడిపి అమరావతి సెంటిమెంటు ను రగుల్చుతూ వైసీపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న నేపథ్యంలో , మూడు రాజధానుల అంశాన్ని రాష్ట్రవ్యాప్తంగా మరింత ఉదృతం చేసి మూడు ప్రాంతాల్లోనూ టిడిపికి వ్యతిరేకత పెరిగేలా వైసిపి ప్లాన్ చేస్తుంది.అందుకే ఉత్తరాంధ్ర, రాయలసీమలో గర్జనలను ఏర్పాటు చేసింది.
రాయలసీమ ద్రోహి చంద్రబాబు అంటూ సీమ గర్జనలో వైసిపి విమర్శలు చేసింది.అలాగే ఉత్తరాంధ్ర ప్రాంతంలోనూ టిడిపి, చంద్రబాబు కు వ్యతిరేకంగా పోరాటాలు మొదలుపెట్టగా, దీనిని తిప్పుకొట్టి రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ పై వ్యతిరేకత పెంచే విధంగా టిడిపి ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై ఫోకస్ చేసింది.
ఈ విషయంలో కేంద్రంపై ఎటువంటి విమర్శలు చేయకుండా, వైసిపిని టార్గెట్ చేస్తూ ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో జగన్ వైఖరి కారణంగానే ఆ హోదా రావడంలేదని, కేంద్రాన్ని ప్రశ్నించే అవకాశం ఉన్నా, జగన్ రాజీ పడ్డారని టిడిపి జనాల్లోకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తోంది .ప్రత్యేక హోదాపై వైసీపీ నోరు మెదపడం లేదని , ఎన్నికలకు ముందు ఒక మాట, అయ్యాక మరో మాట జగన్ మాట్లాడుతున్నారనే విషయాన్ని జనాల్లోకి తీసుకువెళ్లేందుకు టిడిపి వ్యూహం రచిస్తోంది.ఈ విధంగా వైసిపి మూడు రాజధానుల నినాదంతో టిడిపిని రాజకీయంగా ఇబ్బందులు పెట్టాలని చూస్తుండగా, వైసీపీని ఇరుకును పెట్టేందుకు ప్రత్యేక హోదా అంశాన్ని హైలెట్ చేసేందుకు టిడిపి ప్రయత్నిస్తోంది.ఈ విధంగా ఏపీలో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించే పనిలో రెండు ప్రధాన పార్టీలు నిమగ్నమయ్యాయి.