భారత దేశంలోనే అతి పురాతన నగరాలలో ఒకటైన నగరం వారణాసి. ఈ నగరానికి ప్రతిరోజు ఎన్నో లక్షల మంది భక్తులు వస్తూ ఉంటారు.ఎందుకంటే ఈ నగరం హిందువులకు ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రం.ఈ నగరం వారణాసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది.ఇక్కడ ఉన్న గంగానదిలో పుణ్య స్నానాలు ఆచరిస్తే సర్వ పాపాలు తొలగిపోయి పునర్జన్మ విముక్తులు అవుతారని చాలామంది ప్రజలు నమ్ముతారు.
ఇలా వారణాసికి ప్రతి సంవత్సరం చాలా మంది భక్తులు వెళుతూ ఉంటారు.
ఇలా వారణాసికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాసులు బోటు ప్రమాదానికి గురయ్యారు.తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పరిసర గ్రామాలకు చెందిన 120 మంది ఈనెల 20న తీర్థయాత్రలకు బయలు దేరి అలహాబాద్, గాయా, అయోధ్యాలను దర్శించి శుక్రవారం వారణాసికి చేరుకున్నారు.
అయితే వీరందరిలో దాదాపు 40 మంది గంగానదిలో పిండ ప్రదానాలు చేయాలని ఒక బోటులో నది దాటుతుండగా కొంత దూరం బోటు వెళ్లాక దానికి చిల్లు పడింది.

అది చూసిన అందులోని వారు భయంతో కేకలు వేయడం మొదలుపెట్టారు.ఈ ప్రమాదాన్ని అంచనా వేసిన బోటు నడుపుతున్న వ్యక్తి వెంటనే బోటును వెనక్కి తిప్పేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో అందులో ఉన్న ప్రజలందరూ అటు ఇటు కదలడం వల్ల బోటు అదుపుతప్పి బోల్తా పడింది.నదిలో పడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారందరూ రక్షించాలంటూ ఆర్తనాదాలు చేయడం చూసినా సమీపంలో ఉన్న బోటు వారు వెంటనే స్పందించి అక్కడికి చేరుకొని మునిగిపోతున్న 40 మందిని రక్షించారు.
ఈ పడవ ప్రమాదం తెలిసిన వెంటనే వారణాసి కలెక్టర్, పోలీసులు, స్థానిక ఎమ్మెల్యే ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదం గురించి విచారణ చేశారు.ప్రమాదం నుంచి అందరూ సురక్షితంగా బయటపడటంతో అధికారుల బృందం ఊపిరి పీల్చుకుంది.
ప్రస్తుతం నిడదవోలు వాసులంతా వారు ప్రారంభించిన తీర్థయాత్రలన్నిటిని క్షేమంగా ముగించుకుని వారి సొంత గ్రామాలకు బయలుదేరారు.







