నరసాపురం ఎంపీగా 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి రఘురాం కృష్ణంరాజు గెలుపొందారు.ఇక గెలిచిన కొంత కాలం పాటు ఆ పార్టీలో జగన్ కు అత్యంత సన్నిహితుడుగా దర్పం ప్రదర్శించారు.
అయితే కొంతకాలానికి జగన్ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని , విజయసాయిరెడ్డి దానిని అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ, రఘురామ విమర్శలు చేయడం మొదలుపెట్టారు.క్రమక్రమంగా వైసీపీకి పూర్తిగా బద్ధ శత్రువుగా మారిపోయారు.
తరచుగా ప్రభుత్వంపై అనేక విమర్శలు చేస్తూ, కోర్టులో పిటిషన్లు వేస్తూ, కేంద్ర మంత్రులకు ఫిర్యాదులు చేస్తూ, రఘురామ వైసిపికి కంటిలో నలుసుల మారిపోయారు.రఘురామ పై అనర్హత వేటు వేయించేందుకు వైసిపి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తోంది.
అయితే ఇంకా అది పెండింగ్ లో పడింది.వైసిపి ప్రభుత్వంపై ఏ చిన్న ఆరోపణలు వచ్చినా, రఘురామ దానిపై లోతుగా విశ్లేషణ చేస్తూ, టిడిపి అనుకూల మీడియాగా పేరుపొందిన కొన్ని చానళ్ళ డిబేట్ లలో పాల్గొంటూ, మరింత కాక రేపుతూ వైసిపికి బద్ధ శత్రువుగా రోజు రోజు కూ మారిపోతున్నారు. సొంత పార్టీ నేతలతో విభేదాలు మొదలైనప్పటి నుంచి రఘురామ ఏపీలో అడుగుపెట్టడం లేదు.ఏపీలో అడుగు పెడితే తనను ఏదో ఒక కేసులో ఇరికించి అరెస్టు చేస్తారనే భయం లో ఆయన ఉన్నారు.
అందుకే ఢిల్లీ లేదంటే హైదరాబాద్ లో ఆయన ఎక్కువగా కాలం గడుపుతున్నారు.ఇప్పుడు అనవసరంగా ఆయన తెలంగాణ ప్రభుత్వానికి శత్రువుగా మారిపోయారు.ఇటీవల మొయినాబాద్ ఫామ్ హౌస్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే లను బీజేపీ కొనుగోలుకు ప్రయత్నించింది అనే వ్యవహారంపై విచారణ జరుగుతుండగా, అనూహ్యంగా ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు ఎంపీ రఘురాం కృష్ణంరాజుకు నోటీసులు జారీ చేశారు.

ఎమ్మెల్యేల కొనుగోలుకు తాను 100 కోట్లు ఇచ్చేందుకైనా సిద్ధం అంటూ ఆయన అన్నారని అధికారులు అనుమానిస్తున్నారు.దీనికి సంబంధించిన ఆడియో టేపులపైనా విచారణ సాగుతోంది.ఈనెల 29న సిట్ ఎదుట రఘురామ హాజరు కాబోతున్నారు.
ఆ తరువాత చోటు చేసుకునే పరిణామాలు ఏంటి అనేది క్లారిటీ లేనప్పటికీ, తెలంగాణ లో అధికార పార్టీగా ఉన్న టీఆర్ఎస్ తో అయితే శతృత్వం మొదలయినట్టే.ఇప్పుడు ఏపీ , తెలంగాణ ప్రభుత్వాల తో శతృత్వం వల్ల రఘురామ ఎన్నో రకాల ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
జగన్ తో కంటే కేసీఆర్ తో శతృత్వం ఎంత ఘాటుగా ఉండబోతుందో రఘురామ చూడబోతున్నట్టుగానే రాజకీయ వాతావరణం కనిపిస్తోంది.







