జెడి లక్ష్మీనారాయణ! రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు అందరికీ సుపరిచితమే.జగన్ అక్రమస్తుల కేసుతో పాటు, గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ కేసుల వ్యవహారంలోనూ సిబిఐ జాయింట్ డైరెక్టర్ హోదాలో జెడి చూపించిన చొరవ దేశవ్యాప్తంగా ఆయనకు గుర్తింపు తీసుకువచ్చాయి.
ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల వైపు వచ్చినా ఆయన జాయింట్ డైరెక్టర్ ( జేడీ ) హోదా ఆయన ఇంటిపేరుగా మారిపోయింది.ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత చాలాకాలం పాటు ఆయన ఏపీలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు.
క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను అంచనా వేశారు.అప్పట్లోనే ఆయన కొత్త పార్టీ పెట్టబోతున్నట్లుగా హడావుడి నడిచింది.చివరకు లోక్ సత్తా లో చేరతారని భావించినా, ఆ ప్రయత్నాన్ని విరమించుకుని జనసేన పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో జనసేన తరఫున విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు.ఆ తరువాత జనసేన నుంచి బయటకు వచ్చిన జెడి ప్రస్తుతం ఏ పార్టీలోనూ చేరకుండా విశాఖలో వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు.అయితే 2024 ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారా ? ఏ పార్టీలో చేరుతారు అనేది ఆసక్తికరంగా మారింది.ఎప్పటికే బిజెపి ఆయనను చేర్చుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తుంది.అయితే జెడి మాత్రం ఒంటరిగానే పోటీ చేయాలని, అది కూడా విశాఖ నుంచి పోటీ చేసి గెలవాలని చూస్తున్నారు.
ఇదే విషయాన్ని ఆయన నేరుగా బయటపెట్టారు. కాకినాడలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన లక్ష్మీనారాయణ తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని, విశాఖ ఎంపీగా బరిలో ఉండబోతున్నట్లు దీనిపై తన సన్నిహితులతో చర్చలు జరుగుతున్నాయని క్లారిటీ ఇచ్చారు.
అలాగే ఏపీకి అమరావతిని ఏకైక రాజధానిగా ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు.దీంతో ఆయన కచ్చితంగా వైసీపీకి వ్యతిరేకంగానే రాబోయే ఎన్నికల్లో స్టాండ్ తీసుకుంటారనే విషయం పై అందరికీ ఒక క్లారిటీ వచ్చింది.ప్రస్తుతం జేడీ ముందు మూడు ఆప్షన్లు ఉన్నాయి. టిడిపి, జనసేన, బిజెపి. ఈ మూడు పార్టీల్లో ఏ పార్టీలో చేరినా, ఆయనకు కచ్చితంగా ఆయన కోరిన టికెట్ ఇస్తారు.అలా చేరని పక్షంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగుతారు .అలా చేసినా ఈ మూడు పార్టీల నుంచి ఆయనకు పరోక్షంగా మద్దతు లభించే అవకాశం కనిపిస్తోంది.విశాఖలో వైసీపీని ఓడించి మూడు రాజధానుల సెంటిమెంట్ లేదనే విషయాన్ని రుజువు చేసేందుకు ప్రయత్నిస్తున్న విపక్ష పార్టీలన్నీ జేడిని గెలిపించుకుని విశాఖలో వైసిపి ప్రభావం లేకుండా చేసే ఛాన్స్ ఉన్నట్లుగా జెడి సన్నిహితులు అంచనా వేస్తున్నారట.