యాదాద్రి జిల్లా:విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా అవసరమని,తద్వారా పోటీతత్వం పెరుగుతుందని యాదాద్రి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.శుక్రవారం భువనగిరి జిల్లా కేంద్రంలోని కేంద్రీయ విద్యాలయంలో 7 నుండి 10వ తరగతి విద్యార్థిని,విద్యార్థులకు నిర్వహించిన వార్షిక క్రీడా పోటీలకు ఆమె ముఖ్యాతిథిగా హాజరై,జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి క్రీడలను ప్రారంభించారు.
అనంతరం విద్యార్థులనుద్దేశించి ఆమె మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు ఓటమిలను పట్టించుకోవద్దని,ఒకసారి ఓడిపోతే మళ్ళీ గెలవాలనే పట్టుదల పెరుగుతుందని,అందుకే క్రీడల్లో ప్రతీ ఒక్కరూ పాల్గొనడమే ముఖ్యమని సూచించారు.క్రీడల వలన శారీరక ధృఢత్వంతో పాటు మానసిక ఉత్తేజం,పోటీతత్వం పెరుగుతుందని,తద్వారా అన్ని రంగాలలో రాణిస్తారని తెలిపారు.
విద్యార్ధి దశలో ప్రతిఒక్కరూ క్రీడల్లో పాల్గొనాలని, తల్లిదండ్రులు తమ పిల్లలు క్రీడలలో పాల్గొనేలా ప్రోత్సాహించాలని సూచించారు.విద్యార్థి దశలోనే ఎలాంటి ఒత్తిడులు లేకుండా క్రీడలపై శ్రద్ధ పెట్టవచ్చునని,విద్యార్ధి దశను ఆహ్లాదకరంగా ఆస్వాదించాలని,మీకు ఎంతో ఉజ్వల భవిష్యత్ వుందని,మీరందరూ ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా రీజినల్ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించి నేషనల్ స్థాయిలో పాల్గొన్న క్రీడాకారిణి హరిణిరెడ్డి,రీజనల్ స్థాయి హైదరాబాదులో జరిగిన జావెలిన్ త్రో లో రజత పతకం సాధించిన కుశాల్ రెడ్డిని జిల్లా కలెక్టర్ అభినందించారు.ఈ కార్యక్రమంలో కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ ప్రియారాణి,జాతీయ హాకీ కీడాకారులు ఆయాకత్ అలీఖాన్,జిల్లా గజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు మందడి ఉపేందర్ రెడ్డి,జిల్లా యువజన అధికారి ధనంజయ్,ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ చంద్రకళ,పేరెంట్స్ కమిటీ మెంబర్ జ్యోతి, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.







