ఒకవైపు ప్రజలలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలని, ఎన్నికలకు ఇంకా పది నెలలు మాత్రమే సమయం ఉందని, ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు రాకుండా చూసుకుంటూ, నిత్యం ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ , ప్రజల్లో పట్టు సాధించేలా ప్రయత్నించాలని పదేపదే టిఆర్ఎస్ అధినేత , తెలంగాణ సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు , ముఖ్య నాయకులకు హితబోధ చేస్తూనే ఉన్నారు.ఒకవైపు కేంద్ర అధికార పార్టీ బిజెపి తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకుంటుండడం, ప్రజల్లో తమ గ్రాఫ్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో కేసీఆర్ తాను అలర్ట్ గా ఉంటూ, పార్టీ నాయకులను అలెర్ట్ చేస్తున్నారు.
అయితే కేసీఆర్ వ్యాఖ్యలను ఆ పార్టీ నాయకులు అంత సీరియస్ గా అయితే తీసుకున్నట్టు కనిపించడం లేదు.తాజాగా టిఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కారు.కమలాపూర్ లో తహసిల్దార్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి హాజరైన కౌశిక్ రెడ్డి ఈ సందర్భంగా కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులపై అసహనం వ్యక్తం చేశారు.” కళ్యాణ లక్ష్మి పైసలు వచ్చినయ్ , రమ్మని చెప్పిన కొంతమంది రావడం లేదు.కెసిఆర్ కు గర్జుండి డబ్బులు పంపిస్తున్నట్లు ఉంది.రాని వాళ్ళ చెక్కులు క్యాన్సిల్ చేస్తా.అన్ని పథకాలు కావాలంటారు మాకు మాత్రం ఓటేయ్యరు.మొన్న హుజురాబాద్ ఎన్నికల్లో ఆయనకే ఓటేస్తిరి ” అంటూ కౌశిక్ తన అసంతృప్తిని వెళ్ళగక్కారు.

కౌశిక్ వ్యాఖ్యలు రాజకీయంగాను దుమారం రేపుతున్నాయి .ముఖ్యంగా టిఆర్ఎస్ నేతలు ఆయన వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు.ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేస్తున్న క్రమంలో ఈ తరహా వ్యాఖ్యలు చేయడం వల్ల కలిసి వచ్చేది ఏమీ ఉండదని, ప్రజల్లోనూ పార్టీలోనూ ఈ తరహా వ్యాఖ్యల కారణంగా అనవసర తలనొప్పులు ఎదుర్కోవాలి అనే సూచనలు కౌశిక్ కు అందుతున్నాయి.







