భారతీయ యువ వృత్తి నిపుణులకు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ శుభవార్త చెప్పారు.భారతదేశం నుంచి యూకేలో పనిచేసేందుకు ప్రతి ఏటా 3,000 మందిని అనుమతించేలా కొత్త వీసా పథకానికి రిషి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
జీ 20 సదస్సులో భాగంగా ఇండోనేషియాలోని బాలిలో ప్రధాని మోడీతో సమావేశమైన గంటల వ్యవధిలోనే రిషి సునాక్ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.ఈ మేరకు బ్రిటన్ ప్రధాన మంత్రి కార్యాలయం ట్విట్టర్‌లో ఒక ప్రకటన చేసింది.
ఈ స్కీమ్‌లో భాగంగా గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన 18 నుంచి 30 ఏళ్ల లోపు భారత యువ ప్రొఫెషనల్స్ బ్రిటన్‌కు వచ్చి పనిచేసుకోవడంతో పాటు రెండేళ్ల పాటు ఇక్కడే ఉండొచ్చని యూకే పీఎంవో తెలిపింది.
ఇండో పసిఫిక్ ప్రాంతంలోని దాదాపు అన్ని దేశాల కంటే యూకే భారత్‌తోనే ఎక్కువ సంబంధాలు కలిగి వుందని పేర్కొంది.
యూకేలోని అంతర్జాతీయ విద్యార్ధులలో దాదాపు నాలుగింట ఒక వంతు మంది భారతదేశానికి చెందిన వారే.యూకేలో భారత సంతతికి చెందిన వారి పెట్టుబడుల వల్ల 95,000 మందికి ఉపాధి లభిస్తోంది.
యూకే ప్రస్తుతం భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుతోంది.ఒకవేళ ఇండియా కనుక దీనికి ఒప్పుకున్నట్లయితే… ఒక యూరోపియన్ దేశంతో భారత్ చేసుకున్న తొలి ఒప్పందం అవుతుంది.ఈ వాణిజ్య ఒప్పందం ఇప్పటికే 24 బిలియన్ పౌండ్ల విలువైన యూకే – భారత్ వాణిజ్య సంబంధాలపై ఆధారపడి వుంటుంది.అయితే అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థ అయిన భారత్ అందించే అవకాశాలను చేజిక్కించుకోవాలని యూకే తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
ఇకపోతే.జీ 20 సమ్మిట్‌లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్న సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌లతో మోడీ మంతనాలు జరిపారు.వాతావరణ మార్పు, కరోనా మహమ్మారి, ఉక్రెయిన్ రష్యా యుద్ధం తదితర అంశాలపై మోడీ ప్రసంగించారు.