టాలీవుడ్ తీవ్ర విషాదం నెలకొంది.ప్రముఖ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆయన మృతిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటని వ్యాఖ్యనిస్తున్నారు.
సినీ పరిశ్రమ సగర్వంగా తలెత్తుకునేలా అనేక సాహసాలు చేసిన ఆయనకు అశ్రునివాళి తెలియజేస్తున్నారు.
గత కొన్ని రోజులుగా శ్వాస కోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
ఆయన అసలు పేరు ఘట్టమనేని విజయకృష్ణ (80).కార్డియాక్ అరెస్ట్ కావడంతో ఆయనను కుటుంబ సభ్యులు ఆదివారం రాత్రి 2 గంటల సమయంలో ఆస్పత్రికి తరలించారు.
ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్సను అందిస్తున్న ఆయన వైద్యానికి ఆయన శరీరం సహకరించలేదని కాంటినెంటల్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు.బ్రెయిన్ డ్యామేజీ కారణంగా మల్టిపుల్ ఆర్గాన్స్ దెబ్బతిన్నట్లు డాక్టర్లు గుర్తించారు.
ఇంటర్నేషనల్ స్థాయి వైద్యం అందించినా ఫలితం కనిపించలేదు.దీంతో కృష్ణ తుదిశ్వాస ప్రశాంతంగా జరిగేలా వైద్యులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ఈ క్రమంలో మంగళవారం ఉదయం 4.09 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు.
సూపర్ స్టార్ కృష్ణ మృతిపట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.ధైర్యం, సాహసం, పట్టుదల, మానవత్వం, మంచితనం కలబోతే కృష్ణ అని మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యనించారు.
ఆయన మృతి మాటలకందని విషాదమని పేర్కొన్నారు.కృష్ణ లాంటి మహా మనీషి తెలుగు చిత్రపరిశ్రమలోనే కాదని, భారత సినీ పరిశ్రమలోనూ అరుదని చెప్పారు.
కృష్ణ తన సినిమాలతో ప్రజలకు సామాజిక స్పృహ కల్పించారని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు.కృష్ణ కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కృష్ణ తెలుగువారి సూపర్ స్టార్.ఆయనే అల్లూరి.
ఆయనే మన జేమ్స్ బాండ్ అని ఏపీ సీఎం జగన్ అన్నారు.సినీ రంగంలో తనకంటూ ప్రత్యేకతను కృష్ణ సంపాదించుకున్నారని కొనియాడారు.
ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు, తెలుగు వారికి తీరని లోటని వెల్లడించారు.







