ఏకసంతాగ్రాహి అనే పదం మీరు వినే వుంటారు.ఈ పదం ఆ బాలికకు సరిగ్గా సరిపోతుంది.
లేకపోతే 12 ఏళ్లకే కోడింగ్ లో పాఠాలు చెప్పడం ఏమిటి? ఆ వయస్సుకి సరిగ్గా మన మేధావులకు ఎక్కాలే సరిగ్గా రావు.అలాంటిది ఎంతో క్లిష్టమైన కోడింగ్ నేర్చుకోవడం అంటే, మాటలా? వివరాల్లోకి వెళ్లిపోదామా… ఆ బాల మేధావి అనుష్క కొల్లా భారతీయ నౌకాదళ కమాండర్ కేపీ శబరీష్, KS రేణుక దంపతుల ముద్దుబిడ్డ.ఆమె 2009 సెప్టెంబరు 2న జన్మించింది.ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న అనుష్క చిన్నతనం నుంచి చాలా చురుగ్గా ఉండేదట.అనుష్క చురుకుదనాన్ని గమనించిన తల్లిదండ్రులు కోడింగ్ ప్రాముఖ్యతను ఆమెకి వివరించారు.
కోడింగ్ ఆవశ్యకతను గుర్తించిన అనుష్క దాదాపు రెండు సంవత్సరాలుగా అంతర్జాలం ద్వారా 8 నుంచి పదిహేను సంవత్సరాల వయస్సుగల విద్యార్థులకు కోడింగ్‌పై ఉచిత శిక్షణ ఇస్తోంది.
వారానికి ఓ గంటపాటు తరగతులు నిర్వహిస్తోంది.ఈ క్రమంలో బేసిక్స్, నుండి యాప్ డెవలప్‌మెంట్ వరకు ప్రతీది క్షుణ్ణంగా చెప్పడం గమనార్హం.అయితే ఆమెదగ్గర కొంతమంది సీనియర్స్ కూడా సలహాలు అడిగి తీసుకుంటున్నారని తెలుస్తోంది.ఏ విద్యనైనా నేర్చుకోవడం ఒక కళ అయితే, ఇతరులకు నేర్పడం మరొక కళ.ఈ రెండింటిలోనూ అనుష్క సవ్యసాచి అని చెప్పుకోవాలి.

అనుష్క దాదాపు 500 మంది విద్యార్థులకు కోడింగ్ నేర్పించింది.దాంతో ఈ బాలిక సేవలను గుర్తించి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ (వామ్) తాము నిర్వహించిన కార్యక్రమాల్లో అనుష్కను బాల ఉపాధ్యాయ, బాల ద్రోణాచార్య, హాల్ ఆఫ్ ఫేమ్ వంటి పురస్కారాలతో సన్మానం చేసారు.అలాగే విద్యా రంగంలో అనుష్క అందిస్తున్న సేవను గుర్తించి నలంద విశ్వవిద్యాలయం గౌరవ డాక్టర్ ప్రదానం చేసింది.ఇక ప్రముఖ పారిశ్రామివేత్త, జయరాజ్ ఇంటర్నేషనల్ అధినేత అయినటువంటి తాడేపల్లి రాజశేఖర్ రూ.10 వేల నగదు బహుమతి ఆమెకి అందజేశారు.కోడింగ్‌తో సరిపెట్టుకోకుండా కర్ణాటక సంగీతం, పాశ్చాత్య సంగీతంతోపాటు ఫుట్బాల్, స్కేటింగ్, సైక్లింగ్, రన్నింగ్‌లలో కూడా అనుష్క ప్రవేశం సంపాదించుకున్నారు.







