కొన్ని సార్లు దురదృష్టం ఇచ్చే షాకులు మామూలుగా వుండవు.ఇలా కూడా జరుగుతుందా అనేట్లుగా పరిస్ధితులు ఎదురవుతాయి.
తాజాగా ఓ భారతీయ టెక్కీకి అచ్చం ఇలాంటి పరిస్ధితే ఎదురైంది.వివరాల్లోకి వెళితే.
ట్విట్టర్ బాటలోనే ఫేస్‌బుక్ మాతృసంస్ధ మెటా కూడా తన ఉద్యోగులను భారీగా తొలగిస్తున్న సంగతి తెలిసిందే.మొత్తం ఉద్యోగుల్లో 13 శాతం మందిని తొలగిస్తున్నట్లు మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
దీంతో ఆ సంస్థ ఉద్యోగులు దిక్కుతోచని పరిస్ధితుల్లో కూరుకుపోయారు.పెరుగుతున్న ఖర్చులు, ఆర్ధిక మాంద్యం భయాలతో పలు టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయి.
ఆన్‌లైన్ వ్యాపారం పడిపోవడంతో పాటు స్థూల ఆర్ధిక మాంద్యం, పోటీ సంస్థలు, యాడ్స్ సిగ్నల్ లాస్ వంటి కారణాల కారణంగా ఫేస్‌బుక్ ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది.ఈ నేపథ్యంలోనే ఉద్యోగుల తొలగింపు నిర్ణయం తీసుకున్నారు జుకర్ బర్గ్.
అయితే ఈ నిర్ణయం కారణంగా ఓ భారతీయుడు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. ఉద్యోగంలో చేరిన రెండు రోజులకే నిరుద్యోగిగా మారాడు.సదరు బాధితుడి పేరు హిమాన్షు.ఈ ఉద్యోగం కోసమే అతడు భారత్ నుంచి కెనడాకు తన మకాం మార్చడం గమనార్హం.తన ఉద్యోగం పోయిందని.నెక్ట్స్ ఏంటీ అనే దానిపైనా ఆలోచన లేదని హిమాన్షు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.కెనడాలో వుండాలా లేక తిరిగి భారతదేశానికి వెళ్లిపోవాలా, మీకు తెలిసిన చోట సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఏమైనా ఖాళీలు వుంటే చెప్పాలని ఆయన తోటి టెక్కీలను రిక్వెస్ట్ చేశారు.

ఇకపోతే.ఈ హిమాన్షు ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్ధి.అక్కడే గ్రాడ్యుయేషన్ చేసిన ఆయన అడోబ్, ఫ్లిప్‌కార్ట్ , గిట్‌హబ్ వంటి అంతర్జాతీయ సంస్థల్లో పనిచేశారు.
ప్రస్తుతం హిమాన్షు పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.కొందరు ఆయనను ఓదారుస్తుండగా.ఇంకొందరు మాత్రం హిమాన్షు అడిగిన విధంగా ఉద్యోగాల ఖాళీల గురించి చెబుతున్నారు.







