జనం సొమ్ముతో అవినీతి సామ్రాజ్యాలు నిర్మించుకున్న ఆర్ధిక నేరస్థుల కేసులు ఏళ్ళు గడుస్తున్నా అతి,గతి ఉండటం లేదు.ఆర్థిక నేరగాళ్లుగా పేరు మోసిన వారు పలు కేసుల్లో నిందితులుగా న్యాయస్థానాల చుట్టూ తిరిగేవారు పరిపాలకులుగా,ప్రజాధనానికి రక్షకులుగా బాధ్యతలు నిర్వర్తించడం భారతావని లోనే సాధ్యం.
వాయిదాల పై వాయిదాలు వేస్తూ ఏళ్లకు,ఏళ్ళు కొనసాగుతున్న విచారణలు అధికార పక్షాల కనుసన్నల్లో, దమ్ములేని దర్యాప్తు సంస్థలు వేసే పిల్లి మొగ్గలువల్లనే అవినీతి సామ్రాట్ ల ఆటలు యథేచ్ఛగా సాగుతున్నాయి.ఆర్ధిక నేరస్థుల అంతుచూడటం ఏమో కానీ కేంద్రంలో బిజెపి పాలనలో ఆర్ధిక నేరస్థులు అపూర్వ వైభవంతో వెలిగిపోతున్నారు.
నేరస్థుల నేర తీవ్రత కళ్ళకు కడుతున్నా ఆర్ధిక నేరస్థుల కేసులపై విచారణ పూర్తికావడానికి,తీర్పు రావడానికి ఏళ్ళకు ఏళ్ళు పట్టడం దారుణం.చట్టం ముందు అందరు సమానమే అని చెప్పుకోవడానికే తప్ప ఆచరణలో ఎక్కడ అమలు అవుతుంది?చిన్న చేపల విషయంలో బారెడు సాగే చట్టం బడా తిమింగలాల కేసులకు వచ్చేసరికి చట్టం ఎందుకు ముడుసుకు పోతుంది?జగత్ జెంత్రీ,జగత్ కంత్రీ ల అవినీతి కేసులు ఎన్నేళ్లకు తెములుతాయో చెప్పగల నాధుడు లేడు.న్యాయస్థానాల ఆదేశాల మేరకు విచారణ జరుగుతున్న కేసుల్లో కూడా సత్వరం దోషులకు శిక్షలు పడతాయనుకొనే వీలులేకుండా పోయింది.
ప్రభుత్వ సహకారంతో వేలకోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసిన వారిపై విచారణ జరిగే తీరు ఇదేనా? టన్నులు కొద్దీ పత్రాలు సాక్షాధారాలు గా నిలుస్తున్నా,పదులుకొద్దీ చార్జి షీట్లు కళ్ళకు కడుతున్నా,దాదాపు రూ 43 వేలకోట్లు ప్రజాధనం లూటీ జరిగిందని సీబీఐ ప్రాధమిక నివేదిక నిగ్గు తేల్చినా కేసుల విచారణ నత్తనడక నడవడంలో ఔచిత్యం ఏమిటి? ఇంతటి తీవ్రమైన కేసుల విచారణలో మరో సామాన్యుడు వుంటే కేసు విచారణ ఇలానే సాగేదా ? వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేసిన వారి పట్ల కేంద్రప్రభుత్వం, సీబీఐ ఉదాసీనంగా వ్యవహరించడంలో ఆంతర్యం ఏమిటి?మేం అధికారంలోకి రాగానే రాజకీయ నాయకులపై వున్న అవినీతి కేసుల లెక్క తేలుస్తాం,విచారణ వేగంగా పూర్తిచేసి రాజకీయాలను ప్రక్షాలన చేస్తామని ప్రధాని నరేంద్రమోదీ 2014 ఎన్నికల ప్రచార సభల్లో హామీ ఇచ్చారు.

8 ఏళ్ళు దాటింది మోడీ అధికారంలోకి వచ్చి ఆర్ధిక నేరస్థుల పై ఈగైనా వాలక పోగా ఆయన పాలన లో అపూర్వ వైభవంతో వెలిగిపోతున్నారు.అధికారంలోకి వస్తే ఆర్ధిక నేరస్థుల అంతు చూస్తానని ఇచ్చిన హామీ కూడా నేతి బీర చందమైంది.ఆర్ధిక నేరస్థుల అంతుచూస్తానన్న హామీ విని దేశ ప్రజలు ఉప్పోగి పొయ్యారు.కానీ ఆ హామీకి విలువ ఇవ్వక పోవడంతో దేశ ప్రజల ఆశలు ఆవిరయ్యాయి.ఆర్ధిక నేరస్థులను సహించేది లేదన్న మోడీ విస్పష్ట హెచ్చరిక పసలేనిదిగా మిగిలి పోయింది.భవిష్యత్ లో జగన్ చేసిన తరహాలో అవినీతి జరగకుండా నిరోదించాలి అంటే కేంద్ర ప్రభుత్వం భాధ్యతగా,కటినంగా వ్యవహరించాల్సిన అవసరం లేదా? రాష్ట్రాన్ని దోచిన నేరస్థుడు బెయిల్ పై బయటికి రావడమే ఒక వింత అయితే,రాజ్యం ఏలడం మరొక వింతగా వుంది.







