గుజరాత్ లో ఎన్నికల నగారా మోగనుంది.ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.
కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించింది.గుజరాత్ లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
కాగా ఫిబ్రవరి 18తో గుజరాత్ అసెంబ్లీ ముగియనుంది.రెండు విడతల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయని అధికారులు వెల్లడించారు.
తొలి దశ ఎన్నికలకు నవంబర్ 5న, రెండో దశ ఎన్నికలకు నవంబర్ 10వ తేదీన నోటిఫికేషన్ విడుదలకానుంది.తొలి దశ ఎన్నికలు డిసెంబర్ 1న నిర్వహించనున్నారు.
అదేవిధంగా డిసెంబర్ 5న రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి.డిసెంబర్ఈ 8న కౌంటింగ్ ఉండనుంది.
మొత్తం 182 అసెంబ్లీ స్థానాల్లో జనరల్ స్థానాలు 142, ఎస్సీ 13, ఎస్టీ 27 స్థానాలు ఉంటాయి.ఈ నేపథ్యంలో ఎన్నికలకు మొత్తం 51,782 పోలింగ్ స్టేషన్లను అధికారులు ఏర్పాటు చేయనున్నట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.
దేశంలో తొలిసారి షిప్పింగ్ కంటైనర్ లో బూత్ ను ఏర్పాటు చేయనుండటం విశేషం.217 మంది కోసం ఈ కంటైనర్ పోలింగ్ బూత్ ఏర్పాటు కానుంది.అదేవిధంగా ఒక్క ఓటరు కోసం గిర్ ఫారెస్ట్ లో పోలింగ్ బూత్ ఏర్పాటు చేయనున్నారు అధికారులు.
గుజరాత్ లో బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉండేది.కానీ ఈసారి ఆప్ ఎంట్రీతో సీన్ మారే అవకాశం ఉన్నట్లు సమాచారం.దీంతో గుజరాత్ లో ఈసారి ముక్కోణపు పోటీ ఖాయమని అర్థం అవుతోంది.
అంతేకాకుండా ఆప్ ఇప్పటికే తన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.బీజేపీ, కాంగ్రెస్ మాత్రం ఇంకా అభ్యర్థులను ఖరారు చేసే పనిలోనే ఉన్నట్లు తెలుస్తోంది.







