నైట్ క్యాంపెనింగ్ అంటే ఏమిటో నేటి యువతకు ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.ఈ గజిబిజి ఉరుకుల పరుగుల జీవితంలో వారం మొత్తం ఉద్యోగంతో చిత్తైన సగటు ఉద్యోగి ఒత్తిడిని మాయం చేయడానికి ఇటివంటి నైట్ క్యాంపెనింగ్ రిసార్ట్స్ అనేవి పుట్టుకొచ్చాయి.
ఇక్కడ ఒక్క రాత్రిలో స్వర్గ సుఖాలు చూపించి ఒత్తిడి నుండి దూరం చేస్తామని, అలాగే జీవితంలో ఎంజాయ్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తాం అంటూ ఇపుడు ఆన్లైన్ లోనే నిర్వాహకులు పర్యాటకులను చాలాబాగా ఆకర్షిస్తున్నారు.కట్ చేస్తే వీకెండ్ అయినటువంటి శని, ఆదివారాల్లో ఒకటి రెండురోజులు స్వర్గం చూద్దాం అనేలా జంటలు జంటలుగా నైట్ క్యాంపెనింగ్ లకు బయలు దేరుతున్నారు.
ఈ క్రమంలో రిసార్ట్స్, ఫామ్ హౌస్ లలో రాత్రివేళ మందు, చిందు, సరస సల్లాపాలు కానిచ్చేస్తున్నారు.ఇకపోతే మన వికారాబాద్ లో నైట్ క్యాంపెనింగ్ లకు యమ క్రేజ్ ఉంది.
నైట్ క్యాంపెనింగ్ ల పేరుతో ప్రతి శనివారం రాత్రి సర్పంపల్లి ప్రాజెక్ట్, అనంతగిరి ఫారెస్ట్ చుట్టుపక్కల ప్రాంతాలలో శృతిమించిన సరదాలు ఎక్కువైపోతున్నాయంటూ అక్కడి స్థానికులు అరిచి గీ పెట్టినా పోలీస్ శాఖ అధికారులు అటుగా కన్నెత్తి చూడడం లేదట.ఈ క్రమంలో అక్కడికి ఎంజాయ్ చేద్దాం అని వెళ్లిన ఓ వ్యక్తి శనివారం రాత్రి ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలోపడి మృతి చెందిన సంఘటన వికారాబాద్ మండల పరిధిలో చోటుచేసుకున్న ఘటన గురించి అందరికీ తెలిసినదే.

ఆ సంగతి పక్కనబెడితే, హైదరాబాద్ కు కాస్త దూరంలోనే వికారాబాద్ జిల్లా కేంద్రంలో గల అనంతగిరి ఫారెస్ట్ చుట్టుపక్కల ప్రాంతాలు అద్భుతంగా ఉంటాయి.ఇక్కడ ఊటీ లాంటి చల్లటి వాతావరం కలదు.ఆహ్లాదకరమైన ప్రకృతి అందాలు ఇక్కడ అందుబాటులో ఉండడంతో అక్కడికి సేద తీరడానికి వారాంతంలో హైదరాబాద్ మహానగరం నుండి ఆదివారాలలో వేల మంది పర్యాటకులు ఇక్కడ ఉన్న రిసార్ట్స్, ఫామ్ హౌస్ లకు ప్రతి శని, ఆది వారలు వస్తుంటారు.ఆనోటా ఈనోటా ఈ ప్రాంతానికి పబ్లిసిటీ ఎక్కువ కావడంతో, ఈ మధ్య హైదరాబాద్ నుండే కాకుండా ఇతర ప్రాంతాల నుండి కూడా పర్యాటకుల తాకిడి పెరుగుతుంది.
దాంతో నైట్ క్యాంపెనింగ్ ల పేరుతో నిర్వాహకులు ఇక్కడ రూ.లక్షల్లో వ్యాపారాలు చేస్తున్నారు.







