ఇటీవల విశాఖ ఎయిర్ పోర్ట్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు జరిగిన అవమానం, ఆయన్ను పోలీసులు అడ్డుకోవడం వంటి ఘటన తర్వాత నుంచి జనసేన గ్రాఫ్ పెరిగింది.దీంతో పాటు టిడిపి అధినేత చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను కలవడం, సంఘీభావం తెలపడం ఆ తర్వాత పొత్తు సంకేతాలు వెలువడడం, అవసరమైతే కలిసి పోటీ చేసేందుకు సిద్ధం అన్నట్లుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారు.
రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా పొత్తు ఉంటుందనే అంచనాలు ఉండడంతో, అప్పుడే జన సేన లోకి క్యూ కట్టేందుకు ఇతర పార్టీలోని నాయకులు సిద్ధం అయిపోతున్నారు.ముఖ్యంగా టిడిపి నుంచి ఈ వలసలు ఎక్కువయ్యేలా కనిపిస్తున్నాయి.
ఇప్పటికే చాలా నియోజకవర్గాలకు ఎమ్మెల్యే అభ్యర్థులను చంద్రబాబు ముందుగా ప్రకటించారు.జనసేనతో పోత్తు కుదిరే అవకాశం ఉందని ఎప్పుడో భావించిన బాబు చాలా నియోజకవర్గాలకు ఇన్చార్జీలను నియమించకుండా ఖాళీగా ఉంచారు.
ముఖ్యంగా ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలో తో పాటు , ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో జనసేన ప్రభావం స్పష్టంగా ఉంటుంది కాబట్టి, ఆ ప్రాంతాల్లోని కొన్ని నియోజకవర్గాలను జనసేనకు కేటాయించే ఆలోచనతో చంద్రబాబు ఉన్నారు.అయితే జనసేనకు సీటు కేటాయిస్తారు అనుకున్న నియోజక వర్గాల్లో టిడిపి కీలక నాయకులు ఉండడం తో పొత్తు కనుక కుదిరితే తమ పరిస్థితి ఏంటి అనే టెన్షన్ పడుతున్నారు.
అందుకే ముందుగానే టిడిపి నుంచి జనసేనలో చేరి ఆ నియోజకవర్గ టికెట్ ను తమకు కన్ఫామ్ చేయించుకుంటే మంచిదనే ఆలోచనతో చాలామంది ఉన్నారట.దీంతో తాము జనసేనలోకి వస్తామని ఆ నియోజకవర్గ సీటు కేటాయించాలంటూ చాలామంది ఆశావాహులు జనసేన నాయకులతో మంతనాలు మొదలుపెట్టినట్లు సమాచారం.
ఇప్పటికే జనసేనలోకి వెళ్లేందుకు చాలా మంది టిడిపి లోని నాయకులు ప్రయత్నాలు చేస్తుండగా, మరి కొంత మంది మాత్రం ఎన్నికల సమయంలో పార్టీలో చేరాలని భావిస్తున్నారట.
తాము పార్టీ మారకుండా.ఉన్న పార్టీలోనే కొనసాగితే తమకు ఇవ్వాల్సిన టికెట్ ను పొత్తులో భాగంగా జనసేన కు కేటాయిస్తే తమ రాజకీయ భవిష్యత్తు అంధకారంలోకి వెళుతుందని చాలా మంది సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారట.అందుకే ముందుగానే టిడిపికి రాజీనామా చేసి జనసేనలో టికెట్ దక్కించుకోవాలనే ఆలోచనతో మరి కొంతమంది ఉన్నారట.
ముఖ్యంగా టిడిపిలోని సీనియర్ నాయకులు సైతం ఇప్పుడున్న పరిస్థితుల్లో జనసేన ను నమ్ముకుంటేనే విజయావకాశాలు మెండుగా ఉంటాయని భావిస్తున్నారట.ప్రస్తుతం నెలకొన్న పరిణామాలను బట్టి చూస్తే వైసిపి , బిజెపి నుంచి కాకుండా అత్యధిక స్థాయిలో టిడిపి నుంచి జనసేనకు వలసలు వచ్చే అవకాశం కనిపిస్తుంది.