ఉపాయం లేని వారిని ఊరి నుండి తరవమని సామెత.కాని భావోద్వేగాలు రెచ్చగొట్టిన మాయ మాటలు విని విజ్ఞత లేని వారిని పాలకులుగా ఎన్నుకున్న ఫలితం అనుభవిస్తోంది శైశవ ఆంధ్రప్రదేశ్.
ఏ నగరమైన, ప్రాంతమైనా కేవలం ప్రభుత్వం మాత్రమే అభివృద్ధి చేస్తే అభివృద్ధి అవ్వదు.అభివృద్ధి కావడానికి అవసరమైన మౌళిక సదుపాయాలు, భూమి లభ్యత ప్రభుత్వం కల్పిస్తే బహుళ జాతి సంస్థలు, ప్రైవేటు సంస్థలు, ప్రజల భాగస్వామ్యంతో నగరాలు ఏర్పడతాయి.అలా ఏర్పడిందే ప్రస్తుత సైబరాబాద్.1998 లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనికత, కృషి వలన అతి తక్కువ పెట్టుబడితో కేవలం 200 ఎకరాలలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అభివృద్ధి కొరకు ఏర్పడిన హైటెక్ సిటీ 15000 ఎకరాల సైబరాబాద్ గా విస్తరించి ప్రపంచ పటంలో హైదరాబాద్ నగరానికి గుర్తింపు తీసుకురావడమే కాకుండా, తెలంగాణా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభంగా నిలుస్తోంది.అదే విధమైన ఆలోచనతో, దూరదృష్టితో 2014లో ఉమ్మడి రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రథమ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు రాష్ట్రం సత్వర అభివృద్ధి సాధించాలంటే పోలవరం నిర్మాణంతో పాటు, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి చోదక శక్తిగా రాజధాని నగరం ఉండాలనే ఉద్దేశ్యంతో రైల్, రోడ్, విమానయాన సదుపాయాలు, నీటి వనరులు కలిగి .రాష్ట్రానికి నడిబొడ్డున .రెండు పెద్ద నగరాల మధ్య ఉన్న అమరావతి ప్రాంతంలో గ్రీన్ ఫీల్డ్ రాజధాని నిర్మించాలని సంకల్పించారు.దానికి అన్ని రాజకీయపక్షాలు, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డితో సహా మద్దతు పలికారు.
శివరామకృష్ణన్ కమిషన్ కూడా రాజధానికి అనుకూలంగా విజయవాడ ప్రాంతానికి అనుకూల రేటింగ్ ఇచ్చి, ఒక్క భూమి లభ్యత విషయంలో మాత్రం ప్రతికూల రేటింగ్ ఇచ్చారు.
రాజధాని కోసం భూములను ఇస్తే సి ఆర్ డి ఎ ద్వారా మాస్టర్ ప్లాన్ అనుసరించి అభివృద్ధి చేసి , అగ్రిమెంట్ ప్రకారం స్థలాలను రైతులకు తిరిగి ఇస్తామన్న చంద్రబాబు విజ్ఞప్తిని గౌరవించి రాష్ట్ర ప్రభుత్వంపై విశ్వాసంతో, రాష్ట్ర భవిష్యత్తు కోసం 29881 మంది రైతులు తమకు ప్రాణప్రదమైన 34323 ఎకరాల భూమిని భూసమీకరణలో ప్రభుత్వానికి స్వాధీనం చేయడం ప్రపంచ చరిత్రలోనే ఒక అపురూప ఘట్టం.
నీతి ఆయోగ్ ప్రశంశలు పొందిన ఈ భూసమీకరణ విధానం లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో ఒక కేస్ స్టడీగా మారింది.నేను అధికారం లోకి వస్తే అమరావతిని చంద్రబాబు కన్నా వేగంగా అభివృద్ధి చేస్తా, రాజధాని భవనాలన్నీ తాత్కాలిక కట్టడాలు, నా నివాసం రాజధాని ప్రాంతంలోనే ఉంది అని నమ్మించి గెలిచిన జగన్మోహనరెడ్డి అధికారం వచ్చిన తరువాత రకరకాల వింత వాదనలు, దుష్ప్రచారాలతో అమరావతి బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీశారు.
ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి సారధ్యంలో ప్రభుత్వ పెద్దలు చేసిన – అమరావతి కాదు భ్రమరావతి .ముంపు ప్రాంతం .నిర్మాణం ఖర్చు ఎక్కువ .ఒక సామాజిక వర్గం కోసమే అమరావతి .స్మశానం, ఎడారి .ఇన్సైడర్ ట్రేడింగ్ – వంటి ప్రచారాలతో రాజధాని కోసం భూములిచ్చి ప్రపంచానికే ఆదర్శంగా నిలచిన 29 గ్రామాలకు చెందిన రైతుల స్ఫూర్తిని అవమానించారు.కానీ ఈ ప్రచారాలలో నిజం లేదని కోర్టులు, ఎన్ జి టి తీర్పులతో రుజువయ్యింది.జగన్ ప్రభుత్వం రైతుల విశ్వాసాన్ని కోల్పోయింది.

ఫలితమే ప్రస్తుతం ముఖ్యమంత్రి రైతులు భూములిచ్చి అభివృద్ధి పనులకు సహకరించాలని కోరినా పులివెందులలో కూడా రైతులు సహకరించలేదు.ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మూడు రాజధానులు, సి.ఆర్.డి.ఎ రద్దు చట్టాలకు వ్యతిరేకంగా ప్రభుత్వ నిర్భంధ కాండ, పోలీసుల దమన నీతి, అప్రజాస్వామిక విధానాలు, కేసులు, అవమానాలు ఎదుర్కొంటూ 18 డిసెంబర్ 2019 నుండి రైతులు చేస్తున్న శాంతియుత నిరసనలు , న్యాయ పోరాటాలు 750 రోజులు దాటాయి.‘న్యాయస్థానం నుండి దేవస్థానం’ మహాపాదయాత్ర రాజధానేతర ప్రజల మన్ననలు చూరగొంది.
ఉద్యమానికి తలొగ్గి లోప భూయిష్టమైన మూడు రాజధానుల చట్టం, సి.ఆర్.డి.ఎ రద్దు చట్టాలు న్యాయ సమీక్షలో నిలబడవని గ్రహించి ప్రభుత్వం ఆ చట్టాలను ఉపసంహరించుకుంది.
పదే పదే జగన్మోహనరెడ్డి చెప్పేది అమరావతి నిర్మాణానికి లక్ష కోట్లు ఖర్చు చేయాలి, అంత పెట్టుబడి పెట్టే ఆర్థిక స్థోమత రాష్ట్రానికి లేనందునే రాజధాని వికేంద్రీకరణ అని.నిజానికి దాదాపు 9 వేల 4 వందల 92 కోట్ల 46 లక్షల రూపాయల వ్యయంతో రాజధాని ప్రాంతాన్ని నాటి తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి చేస్తే, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుండి అయిన ఖర్చు కేవలం రూ 1103 కోట్లు మాత్రమే.అంటే రాష్ట్ర ఖజానాపై భారం పడకుండా నామమాత్రపు వ్యయంతో రాజధానికి అవసరమైన మౌళిక సదుపాయాలు కల్పించడమే కాకుండా, అభివృద్ధికి ప్రాణవాయువైన 50 వేల ఎకరాల (దాదాపు 16వేల ఎకరాల ప్రభుత్వ భూమి) భూఖజానాను ఖర్చు లేకుండా సాధించడం, సంపద సృష్టించగల చంద్రబాబు చతురతకు, నైపుణ్యానికి, ఆయనపై ప్రజలకున్న నమ్మకానికి నిదర్శనం.







