యాదాద్రి జిల్లా:మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటర్లను కొనుగోలు చేసేందుకు టిఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు డబ్బుల సూట్కేసులతో నియోజకవర్గంలో దిగారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు.మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం నారాయణపురంలోని జైహింద్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన బీజేపీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో మండల కేంద్రానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త వి.ఎన్.గౌడ్,పొర్లగడ్డ తండాకు చెందిన గిరిజనులు భారీ ఎత్తున బీజేపీ పార్టీలోకి చేరారు.అనంతరం రఘునందన్ రావు మాట్లాడుతూ మూడేళ్లుగా ఒకే దగ్గర పనిచేస్తున్న రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ను వెంటనే బదిలీ చేయాలని ఎలక్షన్ కమిషన్ కు లేఖ రాసామని తెలిపారు.
ఏడాది కంటే ఎక్కువ కాలం గులాబీ జెండా రాష్ట్రంలో ఎగరదని,పోలీస్ అధికారులు ఇష్టా రీతిలో బీజేపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు.నిండు సభలో కమ్యూనిస్టులను సూది,దబ్బడం పార్టీలని వెటకారమాడిన కేసీఆర్ తో కమ్యూనిస్టులు ఎలా పొత్తు పెట్టుకుంటున్నారని అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.
కంకి కొడవలి,సుత్తి కొడవలి, ఏనుగు గుర్తులన్నిటిని ముఖ్యమంత్రి కేసీఆర్ కొనుక్కున్నాడని ఆరోపించారు.అసలు యుద్ధం దుబ్బాకతో మొదలైందని,హుజురాబాద్ నుండి ఇప్పుడు మునుగోడుకు చేరుకుందన్నారు.మునుగోడు ప్రజలు కేసీఆర్ వైపు ఉంటారో ఆయనను ఓడగొట్టే పార్టీవైపు ఉంటారో నిర్ణయించుకోవాలని కోరారు.దుబ్బాకలో బీజేపీ గెలుపుతో తమ విలువ పెరిగిందని,ఈటెల గెలుపుతో ప్రగతి భవన్ గేట్లు తెరుచుకున్నాయని,మునుగోడు ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి గెలిస్తే తమను ముఖ్యమంత్రి పేరు పెట్టి పిలుస్తారనే భావన టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులలో ఉందని అన్నారు.23 వేల మంది వీఆర్ఏలు పస్తులుంటే ఇతర రాష్ట్రాల పార్టీల నేతలతో కేసీఆర్ దసరా పండగ దావత్ చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.కేసీఆర్ అధికార పొర కరగడానికి మునుగోడు ఉప ఎన్నికను ప్రజలు ఉపయోగించుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రమేష్ రాథోడ్,మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్,నాయకులు దోనూరి వీరారెడ్డి,వినయ్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షులు జక్కలి విక్రం,కరెంటోతు శ్రీను నాయక్,జక్కడి శ్రీనివాస్ రెడ్డి,మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు బీజేపీ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.







