హోరా హోరీగా జరగబోతున్న మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి పేరును ప్రకటించగా, బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తున్నారు.ఇక అందరికంటే కాస్త ఆలస్యంగా టిఆర్ఎస్ తమ అభ్యర్థిని ప్రకటించింది.
మునుగోడు లో పోటీ చేసేందుకు టిఆర్ఎస్ నుంచి చాలామంది నేతలే ప్రయత్నాలు చేయగా, చివరకు అనుహ్య పరిణామాల మధ్య మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని అభ్యర్థిగా కెసిఆర్ ప్రకటించారు.మొదటి నుంచి ఈయన పేరు పోటీలో ఉండబోతున్నట్లుగా ప్రచారం జరుగుతూనే ఉంది .అయితే పార్టీకి చెందిన మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్ తో పాటు , కర్నే ప్రభాకర్ వంటి వారు గట్టి ప్రయత్నాలు చేసినా, చివరకు సర్వే నివేదికల ఆధారంగా కేసీఆర్ కూసుకుంట్ల వైపు మొగ్గు చూపించారు.
అయితే ఆయన ఎంపిక వెనుక కేసీఆర్ చాలా కసరత్తే చేసినట్టు సమాచారం.
నియోజకవర్గంలో కూసుకుంట్ల కు మంచి పేరు ప్రఖ్యాతలు ఉండడం టిఆర్ఎస్ లో ఉద్యమ కాలం నుంచి పనిచేయడం, 2014లో ఎమ్మెల్యేగా టిఆర్ఎస్ నుంచి గెలుపొందడం, నియోజకవర్గంలో మంచి పరిచయాలు ఉండడం తదితర లెక్కలను పరిగణలోకి తీసుకుని కేసీఆర్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వైపు మొగ్గు చూపినట్లు సమాచారం.నిన్ననే ఆయనను అభ్యర్థిగా ప్రకటించడంతో పాటు, బీఫామ్ ఇచ్చి ఎన్నికల ఖర్చుల నిమిత్తం 40 లక్షల రూపాయల చెక్కును కేసీఆర్ ప్రభాకర్ రెడ్డికి అందించారు.
అయితే ఆయన ఎంపికపై టిక్కెట్ ఆశించి భంగపడిన బూర నరసయ్య గౌడ్, కర్నే ప్రభాకర్ లను తన వద్దకు పిలిపించుకుని బుజ్జగించారు.ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని గెలిపించాలని, టికెట్ దక్కలేదని అసంతృప్తి చెందవద్దని , సరైన సమయంలో సరైన ప్రాధాన్యం ఇస్తామని, రానున్న రోజుల్లో మంచి పదవులు కట్టబెడతామని కెసిఆర్ వారికి హామీ ఇచ్చారట.

మీ ఇద్దరి పేర్లు ముందుగా పరిగణలోకి తీసుకున్నా, స్థానిక పరిస్థితుల నేపథ్యంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇవ్వాల్సి వచ్చిందని , నివేదికలు కూడా ఆయన వైపు సానుకూలంగా ఉన్నాయని కేసీఆర్ వారికి నచ్చచెప్పారట.బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి , కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ల కంటే ప్రభాకర్ రెడ్డి వైపే ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నట్లు కేసీఆర్ సర్వే నివేదికల ద్వారా నిర్ధారణ కు వచ్చి ఆయనను ఎంపిక చేసినట్లు సమాచారం.







