అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో తెలియదు, కానీ అదిగనుకా తెలుచుకుంటే రాత్రికి రాత్రి సుబ్బిగాడు కాస్తా సుబ్బారావు గారు అయ్యిపోతాడు, అప్పలమ్మ అప్సరస అయ్యిపోతుంది.ప్రస్తుతం భారత్ నుంచీ అబుదాబి కి ఉద్యోగం కోసం వెళ్ళిన కుర్రాళ్ళ జీవితాలు రాత్రికి రాత్రి ఇలానే మారిపోయాయి, కార్ షెడ్ లో ఉద్యోగాలు చేసుకునే స్థాయి నుంచీ సదరు షెడ్డు లు ఓ రెండు మూడు కొని పడేయగల స్థాయికి ఎదిగారు భారతీయ యువకులు.
వాళ్ళు దుబాయ్ లాటరీ లో మొత్తం గెలుచుకున్న సొమ్ము తెలిస్తే గుడ్లు బయటకి రావడం ఖాయం.వివరాలలోకి వెళ్తే.
కేరళ రాష్ట్రం నుంచీ దుబాయ్ వెళ్లి అక్కడ ఓ కార్ కంపెనీలో ఉద్యోగంలో చేరిన 20 మంది యువకులు సంపాదించేది నెలకు కేవలం రూ.22 వేలు మాత్రమే.ఈ జీతం కోసం దేశం కాని దేశం వదిలి, కుటుంబ సభ్యులను వదిలి దూరంగా ఉండటం భాధగానే ఉన్నా గత్యంతరం లేకపోవడంతో ఇదే పనిలో ఏళ్ళుగా కొనసాగుతున్నారు.అయితే అక్కడ లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేస్తుంటే ఎప్పటికైనా అదృష్టం వరించక పోదా అనే ఆశతో ఆ 20 మంది యువకులు కలిసి కట్టుగా టిక్కెట్లు కొనుగోలు చేస్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉన్నారు.ఈ క్రమంలోనే

తమ రాష్ట్రం నుంచీ వచ్చిన మరొక యువకుడు ప్రదీప్ పేరుతో ఈ సారి అదృష్టం చెక్ చేసుకుందామని భావించిన అందరూ అతడి పేరుతో టిక్కెట్టు కొనుగోలు చేశారు.ఈ సారైనా సరే అదృష్టం వరిస్తుందో లేదో అనుకుంటున్నా వారికి లాటరీ అబుదాబి బిగ్ టిక్కెట్ నిర్వాహకుల నుంచీ ఫోన్ వచ్చింది.మీరు 20 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్నారని చెప్పడంతో ఒక్కసారిగా అందరి కళ్ళు గిర్రున తిరిగాయి, ఇది నిజమేనా కలా అంటూ షాక్ లో ఉండిపోయారు.నిజమే అని ధృవీకరించుకున్న తరువాత ఉబ్బితబ్బిబ్బై పోయారు.ఇంతకీ 20 మిలియన్ దిర్హమ్స్ అంటే ఎంతో తెలుసా అక్షరాలా రూ.44 కోట్లు పై మాటే ఈ డబ్బును అందరం సమానంగా పంచుకుంటామని, తమ పిల్లల భవిష్యత్తు కోసం ఉపయోగిస్తామని అప్పులు అన్నీ తీర్చేస్తామని తెలిపారు.







