కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ మరో విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు.అక్టోబర్ 5 నుంచి 11 వరకు న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలలో పర్యటించనున్నారు.
భారత విదేశాంగ మంత్రి హోదాలో ఇదే ఆయన తొలి న్యూజిలాండ్ పర్యటన.అక్టోబర్ 6న అక్లాండ్‌లో న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్‌తో కలిసి భారతీయ కమ్యూనిటీ నిర్వహించనున్న కార్యక్రమంలో జైశంకర్ పాల్గొంటారు.
అలాగే వారిని సత్కరించనున్నారు కేంద్ర మంత్రి.అనంతరం భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్న నేపథ్యంలో జరుపుకుంటోన్న ‘‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’’ను పురస్కరించుకుని ‘ఇండియా@75’’ పోస్టల్ స్టాంపులను కేంద్ర మంత్రి విడుదల చేస్తారు.
దీనితో పాటు ‘‘మోడీ@20: డ్రీమ్స్ మీట్ డెలివరీ’’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు జైశంకర్.సిక్కు కమ్యూనిటీతో ప్రధాని నరేంద్ర మోడీకి ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని తెలిపే మరో పుస్తకం ‘‘హార్ట్ ఫెల్ట్- ది లెగసీ ఆఫ్ ఫెయిత్’’ అనే మరో పుస్తకాన్ని కూడా ఆవిష్కరించనున్నారు విదేశాంగ మంత్రి.
అనంతరం అక్లాండ్‌లో న్యూజిలాండ్ విదేశాంగ మంత్రి నానాయా మహుతాతో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొని.ఇరుదేశాల మధ్య సంబంధాలపై సమీక్ష నిర్వహిస్తారని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.అలాగే న్యూజిలాండ్ కమ్యూనిటీ, వాలంటరీ సెక్టార్ మంత్రి భారత సంతతికి చెందిన ప్రియాంకా రాధాకృష్ణన్‌తో సహా పలువురు మంత్రులతోనూ జైశంకర్ భేటీకానున్నారు.పర్యటనలో భాగంగా భారతీయ విద్యార్ధులు, న్యూజిలాండ్ పార్లమెంటేరియన్లు, వ్యాపార వర్గాలు, ప్రవాసులను కూడా కేంద్ర మంత్రి కలుస్తారు.
వెల్లింగ్టన్‌లో కొత్తగా నిర్మించిన భారత హైకమీషన్ భవనాన్ని కూడా జైశంకర్ ప్రారంభిస్తారు.

ఇక.ఆస్ట్రేలియా పర్యటన విషయానికి వస్తే జైశంకర్ కాన్‌బెర్రా, సిడ్నీలను సందర్శిస్తారు.ఈ ఏడాది ఆస్ట్రేలియాను సందర్శించడం ఆయనకు ఇది రెండవ సారి.
ఫిబ్రవరిలో క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం నిమిత్తం జైశంకర్ ఆస్ట్రేలియా వచ్చారు.తాజా పర్యటనలో భాగంగా ఆ దేశ విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్‌తో కలిసి విదేశాంగ మంత్రుల ఫ్రేమ్‌వర్క్ డైలాగ్‌ను నిర్వహిస్తారు.
అలాగే ఆస్ట్రేలియా రక్షణ శాఖ మంత్రి రిచర్డ్ మార్లెస్‌తోనూ ఆయన భేటీ కానున్నారు.సిడ్నీలోని లోవీ ఇన్‌స్టిట్యూట్‌ను సంప్రదించడంతో పాటు ఆస్ట్రేలియన్ నేవీ, మీడియా, థింక్ ట్యాంక్‌లతో కూడా జైశంకర్ పరస్పర చర్చలు జరుపుతారు.