గడిచిన రెండు మూడు వారాలుగా అమెరికాలో భారతీయులు విద్వేష దాడులకు గురవుతున్న సంగతి తెలిసిందే.డల్లాస్‌లోని ఓ రెస్టారెంట్ పార్కింగ్ ఏరియాలో ఎస్మలార్డా ఆప్టన్ అనే మహిళ భారత సంతతి మహిళలను అసభ్యపదజాలంతో దూషించడంతో పాటు దాడికి దిగింది.
ఈ ఘటన మరిచిపోకముందే.కాలిఫోర్నియా రాష్ట్రంలో మరో విద్వేషదాడి జరిగింది.
అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే .బాధితుడు, నిందితుడు ఇద్దరూ భారతీయులే కావడం.
అయితే అమెరికన్లు అమెరికాలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ భారతీయులతో పాటు విదేశీయులను టార్గెట్ చేస్తున్నారు.భౌతికదాడులతో పాటు జాత్యహంకార వ్యాఖ్యలు చేస్తున్నారు.పోలండ్ పర్యటనకు వచ్చిన ఓ అమెరికన్ టూరిస్ట్ భారతీయుడిపై విద్వేషం వెళ్లగక్కాడు.అయితే ఇవన్నీ భారతదేశానికి బయట జరిగినే.
కానీ తొలిసారిగా భారత్‌లో భారతీయుడిపై అమెరికన్ పౌరుడు జాతి విద్వేష వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది.
శుక్రవారం సాయంత్రం ఎయిర్ విస్తారా విమానంలో బెంగళూరు నుంచి ఢిల్లీకి ప్రయాణిస్తున్న ఒక భారతీయ ప్రయాణీకుడిపై అమెరికన్ పౌరుడు జాతి విద్వేష వ్యాఖ్యలు చేశాడు.
దీనికి సంబంధించి ‘‘ ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్’’ వార్తాసంస్థ కథనాన్ని ప్రచురించింది.దీని ప్రకారం.బాధితుడిని ఢిల్లీకి చెందిన ఆర్ధిక నిపుణుడైన దివ్యేందు శేఖర్‌గా గుర్తించారు.బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో విమానంలో ప్రవేశించడానికి ఏరోబ్రిడ్జ్ వద్దే అతను గలాటా ప్రారంభించాడని శేఖర్ తెలిపారు.
పేరు తెలియని అమెరికన్ పౌరుడు, అతనికి 28 నుంచి 29 సంవత్సరాల వయసు వుంటుందని, బ్లాక్ టీషర్ట్, బ్లాక్ షార్ట్ ధరించి క్యూలోకి దూకేందుకు ప్రయత్నించాడని శేఖర్ వెల్లడించారు.దీనిని గమనించిన తాము అతనిని అడ్డుకుని క్యూలో రావాల్సిందిగా వెనక్కి పంపినట్లుగా తెలిపారు.
విమానం ఎక్కిన తర్వాత తన సీటు పక్కనే సదరు అమెరికన్‌కి సీటు వచ్చిందని, కానీ భారీ లగేజ్‌తో రావడంతో దానిని క్యాబిన్‌పై వుంచాలని సిబ్బంది అతనికి సూచించారని ఆయన చెప్పారు.అయితే అతను వారి మాటలను పట్టించుకోకుండా సీటుపై పెడతానని పట్టుబట్టి ముందుకు నెట్టడంతో తన కాలికి గాయమైందని శేఖర్ వెల్లడించారు.
దీని గురించి తాను చాలా మర్యాదగా అతనిని ప్రశ్నించగా.ఆ అమెరికన్ మాత్రం తీవ్రంగా స్పందిస్తూ బ్యాగ్ పెట్టుకోవడానికి తాను డబ్బు చెల్లించానని చెప్పాడు.అంతేకాకుండా ఆర్మ్‌రెస్ట్‌ని కిందకి దించి.అసభ్యపదజాలంతో దూషించాడని శేఖర్ పేర్కొన్నారు.

అతని దూషణలు తారాస్థాయికి చేరడంతో తన సీటు మార్చాల్సిందిగా ఫ్లైట్ అటెండెంట్‌ని కోరానని ఆయన చెప్పారు.దీనికి సదరు అమెరికన్ పౌరుడు స్పందిస్తూ.మీ భారతీయలు ఎప్పుడూ విసుక్కుంటారు అంటూ మండిపడ్డాడు.అయితే 16సీలో కూర్చొన్న ఓ వ్యక్తి తన సీటులో కూర్చోవాల్సిందిగా కోరాడని.దీంతో తాను పైకి లేచి వెళ్లబోతుండగా అమెరికన్ వ్యక్తి తనకు దారి ఇవ్వలేదని శేఖర్ పేర్కొన్నారు.అతని తీరుపై విస్తారా సిబ్బందికి పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందించలేదని ఆయన వాపోయాడు.
ఢిల్లీలో ల్యాండైన వెంటనే విమానం నుంచి దిగిన అతను ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్లిపోయాడని శేఖర్ చెప్పారు.భారతదేశంలో జాత్యహంకారాన్ని ఎదుర్కోవడం తనకు ఇదే తొలిసారి అని ఆయన తెలిపారు.
అయితే ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు విస్తారా ఎయిర్‌లైన్స్ తెలిపింది.







