సూర్యాపేట జిల్లా:మేళ్లచెరువు మండల కేంద్రంలోని భూదాన్ భూముల విక్రయం,అక్రమ నిర్మాణాలపై మైహోమ్,కీర్తి సిమెంట్ యాజమాన్యాలతో సహా నిందితులకు సహకరించిన ఆరుగురు ప్రభుత్వ అధికారులపై క్రిమినల్ కేసు నమోదుకు హుజూర్ నగర్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.కోర్టులో కేసు దాఖలు చేసిన స్థానిక న్యాయవాది కమతం నాగార్జున వాదనలు విన్న కోర్టు మై హోమ్ పై క్రిమినల్ చర్యకు ఆదేశించింది.
ఇందులో భాగంగా ఫోర్జరీ,చీటింగ్,ప్రభుత్వ ఆస్తి ధ్వంసం,కోర్టులో పెండింగ్ ఉన్న భూమిని అమ్మకం,ల్యాండ్ కబ్జా కేసులు నమోదు చేయాలని హుజూర్ నగర్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు మేళ్లచెరువు పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కు ఆదేశాలు జారీచేసింది.నిందితులుగా మైహోమ్ సిమెంట్స్ భూముల వ్యవహార ప్రతినిధి మైహోమ్స్ అధినేత జూపల్లి రామేశ్వరరావు బామ్మర్ది మునగాల రామ్మోహన్ రావు,మైహోం ప్లాంట్ హెడ్ మరియు ప్రెసిడెంట్ ఎన్.శ్రీనివాసరావు,జిఎం కె.నాగేశ్వరావు, కీర్తి సిమెంట్ ఎండి జాస్తి త్రివేణి,మేనేజింగ్ పార్ట్నర్, ఎండి భర్త జాస్తి శేషగిరిరావు,వైస్ ప్రెసిడెంట్ జె.శ్రీనివాస్,మేళ్లచెరువు తహశీల్దార్ కొల్లు దామోదర్, మండల రెవిన్యూ ఇన్స్పెక్టర్,మేళ్లచెరువు పంచాయతీ కార్యదర్శి ఈర్ల నారాయణరెడ్డి,ఇరిగేషన్ ఈఈ, విద్యుత్ శాఖ ఏఈ ఉన్నారు.హైకోర్టులో కేసు పెండింగ్ ఉన్న ప్రభుత్వ ఆధీనంలోని 160 ఎకరాల భూదాన్ భూములపై ఫోర్జరీ పత్రాలు సృష్టించి అమ్మకాలు జరిపారని,ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టినట్టు,మట్టి మాఫియా,బోర్ల తవ్వకాలు,అధికార యంత్రాంగాన్ని తప్పుదోవ పట్టించి ఎన్ఓసి పత్రాలు పొందినట్లు అభియోగాలు ఉన్నాయి.