ప్రస్తుత కాలంలో కస్టమర్ల నుంచి బ్యాంకులు వివిధ ఛార్జీల రూపంలో వసూలు చేస్తున్నాయి. ఏటీఏంల వినియోగానికి, కనీస బ్యాలెన్స్ లేదని, బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసినందుకు, ఎస్ఎంఎస్‌లు పంపినందుకు ఇలా ఏవో ఒక కారణాలతో ఛార్జీలు ముక్కు పిండి వసూలు చేస్తున్నాయి.
ఎడా పెడా ఛార్జీలు విధించి కస్టమర్ల నుంచి భారీగా దండుకుంటున్నాయి.ఈ తరుణంలో కస్టమర్లకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) గుడ్ న్యూస్ అందించింది.
మొబైల్ ఫండ్ బదిలీలపై ఎస్ఎంఎస్ ఛార్జీలను మినహాయించాలని తాజాగా నిర్ణయించింది.ఎస్ఎంఎస్ ఛార్జీలను మినహాయించడంతో, వినియోగదారులు USSD సేవలను ఉపయోగించి ఎటువంటి అదనపు ఛార్జీలు చెల్లించకుండా లావాదేవీలు చేయవచ్చని బ్యాంక్ తెలిపింది.

మొబైల్ ఫండ్ బదిలీలపై SMS ఛార్జీలు మినహాయించబడినట్లు ప్రకటించడానికి తాము సంతోషిస్తున్నామని ఎస్‌బీఐ ట్విట్టర్‌లో పేర్కొంది.యుఎస్‌ఎస్‌డి సేవలను ఉపయోగించి వినియోగదారులు ఇప్పుడు ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా సౌకర్యవంతంగా లావాదేవీలు చేయవచ్చని ఎస్‌బిఐ ప్రకటించింది.ఉచిత మొబైల్ ఫండ్ బదిలీలు ప్రత్యేకించి ఫీచర్ ఫోన్‌లను ఉపయోగించే SBI కస్టమర్లకు ప్రయోజనం చేకూరుస్తాయి.
USSD లేదా అన్‌స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా సాధారణంగా టాక్ టైమ్ బ్యాలెన్స్‌లు, ఖాతాలో బ్యాలెన్స్ తనిఖీ చేయడానికి, మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీల కోసం ఉపయోగించబడుతుంది.ఫీచర్ ఫోన్‌లలో ఈ సర్వీస్ పనిచేస్తుంది.
దేశంలోని 1 బిలియన్ మొబైల్ ఫోన్ వినియోగదారులలో 65 శాతం కంటే ఎక్కువ మంది ఫీచర్ ఫోన్‌లను కలిగి ఉన్న వినియోగదారులకు ఈ నిర్ణయం ప్రయోజనం చేకూరుస్తుంది.సాధారణంగా స్మార్ట్ ఫోన్లు ఉన్న వారికి ఇది అవసరం ఉండదు.అయినప్పటికీ వారు కూడా దీనిని వినియోగించుకోవచ్చు.*99# డయల్ చేయడం ద్వారా ఇంటర్‌నెట్ సాయం లేకుండా బ్యాంకింగ్ సేవలు పొందొచ్చు.







