తెలంగాణలో పార్టీ బలోపేతం అయ్యేందుకు, రాబోయే ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి వచ్చేలా చేసేందుకు ఆ పార్టీ అగ్ర నేతలు వరుసగా తెలంగాణ కు క్యూ కడుతున్నారు.ఎప్పటికప్పుడు రాష్ట్ర నాయకులకు తగిన సూచనలు చేస్తూ, అధికార పార్టీ టిఆర్ఎస్ పై పట్టు సాధించే విధంగా ప్రోత్సహిస్తున్నారు.
కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తో పాటు, బీజేపీ అగ్ర నేతలంతా సందర్భం వచ్చినప్పుడల్లా తెలంగాణలో అడుగు పెడుతూ, టిఆర్ఎస్ పై విమర్శలు చేస్తూ బిజెపికి తెలంగాణ ప్రజల్లో ఆదరణ పెంచే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.ఇదిలా ఉంటే నిన్న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్రం అధికారికంగా నిర్వహించింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరయ్యారు.ఈ సందర్భంగా టిఆర్ఎస్ టార్గెట్ గా అమిత్ షా అనేక వ్యూహాలను తెలంగాణ బిజెపి నాయకులకు సూచించారు తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావడం లక్ష్యం అని , దీనికోసం ఎన్నిసార్లైనా ఇక్కడికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారట.
విమోచన వేడుకలు అనంతరం బేగంపేట హరిత ప్లాజా లో పార్టీ ముఖ్య నాయకులతో అమిత్ షా భేటీ అయ్యారు.ఈ మీటింగ్ వాడి వేడి గా జరిగింది.
తెలంగాణలో బిజెపి అధికారంలోకి వచ్చేందుకు ఎంతో సమయం లేదని, కొద్దిదూరంలోనే ఉన్నామని, ఇంకొంచెం పోరాడితే అధికారంలోకి రావచ్చని అమిత్ షా రాష్ట్ర నాయకులకు సూచించారట.అలాగే మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైనా నాయకులకు దిశా నిర్దేశం చేసినట్లు సమాచారం.
అలాగే తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ చేపడుతున్న ప్రజా సంగ్రామ పాదయాత్రకు వస్తున్న స్పందన, క్రమక్రమంగా బిజెపికి పెరుగుతున్న గ్రాఫ్ అన్నిటిని ప్రస్తావించి సంజయ్ నాయకత్వాన్ని అమిత్ షా ప్రశంసించారట.అలాగే ప్రజలకు మరింత దగ్గర అయ్యేందుకు చేపడుతున్న కార్యక్రమాలను ప్రస్తావించారట.
పార్లమెంట్ ప్రవాస్ యోజన, ప్రజాగోష బిజెపి భరోసా బైక్ ర్యాలీలు వంటి వాటి ద్వారా బిజెపి గ్రాఫ్ పెరిగిందని, తెలంగాణ బిజెపి నాయకులను అమిత్ షా అభినందించారట.

జనాల్లోకి పార్టీని తీసుకు వెళ్లే విషయంలో అందరూ సమిష్టిగా కృషి చేస్తున్నారని , అయితే పార్టీలో గ్రూపు రాజకీయాలు ఎక్కువయ్యాయని, అంతా సమిష్టిగా పనిచేస్తేనే పార్టీని అధికారంలోకి తీసుకురాగలమని, ఈ విషయంలో మరింత దృష్టి సారించాలని అమిత్ షా నాయకులకు హితబోధ చేశారట.ప్రస్తుతం ఉన్న స్పీడ్ ఏమాత్రం సరిపోదని , మరింత స్పీడ్ పెంచాలని పార్టీ నాయకులకు సూచించారట.తెలంగాణలో బిజెపి అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన సలహాలు సూచనలు, ఇవ్వడంతో పాటు, ఎప్పుడు కావాలంటే అప్పుడు తెలంగాణలో బిజెపి తరఫున వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తామంతా సిద్ధమని అమిత్ షా పార్టీ నేతలకు చెప్పారట.
రాబోయే మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బిజెపి గెలిస్తేనే పార్టీకి భవిష్యత్తు ఉంటుందని, దీనిపై పార్టీ నేతలు అంత సమిష్టిగా పనిచేసి పార్టీకి విజయాన్ని తీసుకురావాలని సూచించారట.అలాగే మునుగోడు నియోజకవర్గంలో పార్టీ తరఫున కమిటీలను రెండు రోజుల్లోగా పూర్తి చేయాలని నియోజకవర్గంలోని 189 గ్రామాల్లో ప్రతి గ్రామానికి ముగ్గురితో ఒక కమిటీని నియమించి పార్టీ ఇక్కడ విజయం సాధించేలా చేయాలని తెలంగాణ బీజేపీ నాయకులకు అమిత్ షా సూచించారట.







