టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును దెబ్బతీయడమే లక్ష్యంగా ఎప్పటికప్పుడు వ్యూహాలు రచిస్తూ ఉంటారు వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్.ముఖ్యంగా బాబుకు కంచుకోటగా ఉన్న కుప్పం నియోజకవర్గంలో పరిస్థితులను మార్చేందుకు జగన్ ప్రయత్నాలు మొదలుపెట్టారు.
ఇప్పటికే కుప్పం మున్సిపాలిటీని వైసిపి సొంతం చేసుకుంది దీంతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబును ఎమ్మెల్యేగా ఓడించడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది ఈ బాధ్యతలను జగన్ కు అత్యంత సన్నిహితుడైన చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి బాధ్యతలను అప్పగించారు.
ఈ జిల్లా పై గట్టి పట్టు ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి చంద్రబాబును దెబ్బతీసే వ్యూహంలో మునిగితేలుతున్నారు.
ఇక జగన్ సైతం కుప్పంలో పరిస్థితులను ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.టిడిపికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ స్థానం దక్కకుండా చేసేందుకు పావులు కదుపుతున్నారు.దీనిలో భాగంగానే ఈనెల 22వ తేదీన జగన్ కుప్పం నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు.ఇటీవల టిడిపి అధినేత చంద్రబాబు ఈ నియోజకవర్గంలో పర్యటించారు.
ఈ నియోజకవర్గంలో పరిధిలోని ప్రతి మండలంలోని ఆయన పర్యటన కొనసాగింది.ఆ తర్వాత టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించారు.
అధికార పార్టీ ఈ నియోజకవర్గాన్ని టార్గెట్ చేసుకోవడంతో పదేపదే చంద్రబాబు, లోకేష్ ఈ నియోజకవర్గంలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు స్థానిక నాయకులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు.అయితే అనేకసార్లు ఈ నియోజకవర్గంలో నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా, టిడిపి అధికారంలో ఉన్నా, ఈ నియోజకవర్గాన్ని చంద్రబాబు పట్టించుకోలేదని తామే అభివృద్ధి చేసి చూపిస్తున్నామనే విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చేసేందుకు ఇక్కడ పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు .
ఇప్పుడు జగన్ ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయబోతున్నారు.ఈ సందర్భంగా జగన్ కు స్వాగతం పలికేందుకు భారీగా ఏర్పాట్లు చేశారు.అలాగే బహిరంగ సభను నిర్వహించి భారీ ఎత్తున జనాలను సమీకరించేందుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారు.జగన్ భారీ బహిరంగ సభ నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చూడడంతో పాటు, టిడిపి నుంచి భారీ ఎత్తున చేరికలు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
రాబోయే ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో చంద్రబాబును ఓడించి తన సత్తా చాటుకుని జగన్ వద్ద మరింత పలుకుబడి పెంచుకోవాలనే లక్ష్యంతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ నియోజకవర్గంలో వర్క్ చేస్తున్నారట.