‘ఇంకేంటి శీనన్న … ఇంకేంటి శీనన్న ‘ అనే ఉత్కంఠ ఎవరికి వద్దు.మీ వెంట ఉండే వారిలో అదే ఉత్కంఠ కలిగించ వద్దు.
కాలం , సందర్భం అన్ని భగవంతుడు నిర్ణయిస్తాడు ” అంటూ కొద్దిరోజుల క్రితం ఖమ్మం మాజీ ఎంపీ టిఆర్ఎస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన అనుచరులను ఉద్దేశించి అన్నారు.చాలా కాలంగా ఆయన టిఆర్ఎస్ లో సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు.
అదే సమయంలో బిజెపి నేతలతో టచ్ లోకి వెళ్లినట్లుగా ప్రచారం జరుగుతోంది .దీనికి తగ్గట్లుగానే ఇటీవల పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమార్తే వివాహ విందును అత్యంత భారీగా నిర్వహించారు.ఈ రిసెప్షన్ కు రాజకీయ ప్రముఖుల అందరిని ఆహ్వానించారు.అయితే ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ తో సహా టిఆర్ఎస్ కీలక నాయకులు హాజరు కాకపోవడంతో , ఆయన టిఆర్ఎస్ ను వీడుతారని ప్రచారం మరింత ఊపేందుకుంది.
దీంతో మరోసారి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మార్పు వ్యవహారం తెరపైకి వచ్చింది.అసలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీలోకి వెళ్తారనే ఆసక్తికరమైన చర్చ ఖమ్మం రాజకీయాల్లో నడుస్తోంది.
కాంగ్రెస్ వైపు వెళ్లాలనుకుంటున్నారా లేక బీజేపీ వైపు వెళ్తారా విషయంలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నా, శ్రీనివాసరెడ్డి మాత్రం తన మనసులో మాట ఏమిటనేది అనుచరులకు కూడా తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు.ఒకవైపు కాంగ్రెస్ , బిజెపిలు పొంగులేటిని తమ పార్టీలో చేర్చుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాయి .ఆయనపై ఒత్తిడి పెంచుతున్నాయి.ఆయన పదేపదే అనుచరులను ఉద్దేశించి పార్టీ మార్పు అంశంపై తనపై ఒత్తిడి తీసుకురావద్దని దేవుడు ఉన్నాడని ఆయనే అన్ని చూసుకుంటాడని, దారి చూపించేది కూడా దేవుడే అంటూ పొంగిలేటి మాట్లాడుతుండడంతో అనుచరులలోను అయోమయం నెలకొంది.

తొందరపడితే బొక్క బోర్ల పడతామని గుర్తుంచుకోవాలని అనుచరులను ఉద్దేశించి పొంగులేటి హెచ్చరిస్తున్నారు.దీంతో ఇప్పట్లో ఆయన పార్టీ మారే ఉద్దేశం లేదని మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికల ఫలితాలు తేలిన తర్వాతే.ఏ పార్టీ బలం ఎంత అనేది ఒక అంచనా ఏర్పడుతుందని, అప్పుడు సరైన సమయం చూసుకుని అనువైన పార్టీలోకి వెళ్లాలని పొంగులేటి చూస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.ఇప్పుడు పార్టీ మారినా ఇబ్బందులు ఎదురవుతాయని, అదే ఎన్నికల ఫలితాలు తర్వాత అయితే గెలిచే పార్టీ ఏదో సుమారుగా అంచనా దొరుకుతుందని, అప్పుడు మాత్రమే పార్టీ మారే విషయమై తన ముఖ్య అనుచరులతో సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోవాలని పొంగులేటి వెయిటింగ్ చేస్తున్నారట.
మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు తేలిన తర్వాతే శ్రీనివాస్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్టుగా అర్థం అవుతోంది.







