రానురాను కేటుగాళ్లు పెట్రేగి పోతున్నారు.తాజాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆన్‌లైన్ మోసానికి గురయ్యాడు ఓ నిరుద్యోగి.
దొంగ దారుల్లో రకరకాల స్కీములు చెబుతూ మోసం చేస్తూ వచ్చిన కేటుగాళ్లు ప్రజల్లో కొంత అవగాహన పెరిగే సరికి, అప్పటికే మార్కెట్లో మంచి పేరున్న పెద్ద పెద్ద కంపెనీల పేరుతో నకిలీ వెబ్ సైట్లను తయారు చేసి, తద్వారా మోసాలు చేయడం స్టార్ట్ చేసారు.ఈ క్రమంలో పక్కా స్కెచ్‌తో ఓ యువకుడిని ఫ్లిప్‌కార్ట్ కంపెనీలో ఉద్యోగం పేరుతో మోసం చేశారు.
వివరాల్లోకి వెళితే.
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నమిలికొండ గ్రామానికి చెందిన ‘దయ్యాల నిఖిల్’ అనే యువకుడికి సైబర్ నేరగాళ్లు తన మొబైల్ కి ఫ్లిప్‌కార్ట్ నుంచి చేస్తున్నట్లుగా పార్ట్ టైం జాబ్ అంటూ మెసేజ్ పంపించారు.
దీంతో ఆ యువకుడు సైబర్ నేరగాళ్లు పంపించిన లింకును ఓపెన్ చేశాడు.ఈ క్రమంలో వారు ఇచ్చిన టాస్కులను కంప్లీట్ చేస్తూ ఉండగా వెయ్యి రూపాయలు కమిషన్ వచ్చిందంటూ ఆ యువకుడికి బ్యాలెన్స్ చూపించగా మరిన్ని టాస్కులు కంప్లీట్ చేయమని మరో వెయ్యి రూపాయలు బ్యాలెన్స్ వచ్చింది.
దాంతో ఆ యువకుడు జోరుగా ఆ టాస్క్ లను కంప్లీట్ చేయడం మొదలు పెట్టాడు.
అలా చేయగా రు.254000 కమిషన్ వచ్చిందంటూ నేరగాళ్లు వాట్సాప్‌లో మెసేజ్ పెట్టారు.ఇక ఆ మొత్తాన్ని ఎలా డ్రా చేసుకోవాలో అని సంప్రదించగా మీరు కొంత టాక్స్ నగదు చెల్లించాల్సి ఉంటుందని మొదటగా 20 వేల రూపాయలు చెల్లించాలని నేరగాళ్లు తెలిపే సరికి తన అకౌంట్ నుండి ఆ నెంబర్కు ట్రాన్స్‌ఫర్ చేశాడు.
ఇలా పలు దఫాలుగా వారం రోజుల్లో 1,90,000 నేరగాళ్లు బాధితుడి దగ్గర నుంచి ఆన్‌లైన్ లో ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు.తనకు ఇంకా డబ్బులు రావడం లేదని వాట్సాప్ లో మెసేజ్ చేయగా మరో 61 వేల రూపాయలు ట్రాన్స్‌ఫర్ చేస్తే మీరు చెల్లించిన మొత్తం మీరు సంపాదించిన మొత్తం మీకు వస్తాయని అనేసరికి అనుమానం వచ్చిన యువకుడు కొడిమ్యాల పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.







