ఉప ఎన్నికల్లో గెలుపు ప్రణాళిక రూపకల్పన పార్టీలో విభేదాలు కట్టడి వచ్చే శాసనసభ సమావేశాల కోసం తదితర లక్ష్యాలతో ఈనెల 3న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో పార్టీ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది.మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామా తరువాత సీఎం బహిరంగంగా నిర్వహిస్తున్న పార్టీ మొదటి సమావేశం ఇదే.
ఈ ఉప ఎన్నికను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు.మిగిలిన పార్టీల కంటే ముందే భారీ సభను నిర్వహించారు.
ఇది తెలంగాణ బతుకుదెరువు ఎన్నిక అని సభలోనే సీఎం కేసీఆర్ చెప్పారు.
ఈ ఎన్నికలో గెలిచి కేంద్రానికి సత్తా చాటాలని మరింత ఉత్సాహంతో వచ్చే శాసనసభ ఎన్నికలకు సన్నద్ధం కావాలనీ ఆకాంక్షిస్తున్నారు.
ఈ క్రమంలో పూర్తిస్థాయి ప్రచార వ్యూహం ఎన్నికల కార్యచరణ కోసం ఎక్కువ మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను ప్రచారంలోకి దింపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం.గ్రామానికో కీలక ప్రజా ప్రతినిధిని పర్యవేక్షకునిగా నియమించాలని ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది.
ఇందులో భాగంగానే వచ్చే నెల రెండో వారంలో చండూరు లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్నారు.ఆ తర్వాత మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఇతర ముఖ్య నేతల సభలు, సమావేశాలు మునుగోడులో జరిగే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో రోడ్ షోలు ఇంటింటి ప్రచారం తదితర అంశాలకు సంబంధించిన వ్యూహంపై శాసన సభాపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిశా నిర్దేశం చేస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

పలు జిల్లాలు, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర నేతల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి.ఒక వర్గంపై మరో వర్గం దాడులకు పాల్పడుతుంది.ఉదాహరణకు తాండూరు, వికారాబాద్ లలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి వర్గానికి, ఎమ్మెల్యేలు రోహిత్ రెడ్డి, మెతుకు ఆనంద్ లకు మధ్య విభేదాలు ఉన్నాయి.
కొల్లాపూర్ లో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పరస్పరం సవాళ్లు విసురుకున్నాయి.







