విదేశీ విద్య అనగానే ఇప్పటికి గుర్తొచ్చేది అమెరికానే.అమెరికాలో చదువుకుని, ఉద్యోగం సంపాదించాలని ఎంతో మంది విదేశీ విద్యార్ధులు కలలు కంటుంటారు.
విదేశీ విద్యార్ధులను ఆకర్షించేలా అందుకు తగ్గ పరిస్థితులను కూడా అమెరికా కల్పించింది.అయితే ప్రస్తుతం ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
ప్రస్తుతం అమెరికా వెళ్లి చదువుకునే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని అత్యధిక శాతం మంది భారతీయ విద్యార్ధులు కెనడా చదువులకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది.అయితే ఒక్క సారిగా భారతీయ విద్యార్ధులు పెద్ద ఎత్తున కెనడా కు క్యూ కట్టడానికి కెనడా తీసుకున్న ఆ ఒక్క నిర్ణయమే అంటున్నారు నిపుణులు అదేంటంటే.
కెనడా వైపు కేవలం భారతీయ విద్యార్ధులు మాత్రమే కాదు, విదేశీ విద్యార్ధులు సైతం ఆకర్షింపబడటానికి కారణం విద్యార్ధులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తరువాత కూడా కెనడాలోనే ఉంటూ ఉద్యోగం పొందేందుకు వీలు కల్పించడమే.అంతేకాదు అతి తక్కువ కాలంలో కెనడాలో శాశ్వత నివాసం పొందేందుకు కూడా అవకాశం కల్పించడం కూడా మరొక రీజన్ అంటున్నారు నిపుణులు.
ఈ కారణాల వలెనే భారతీయ విద్యార్ధులు అమెరికాను సైతం కాదనుకుని మరీ కెనడా వైపు మొగ్గు చూపుతున్నారట.ఇదిలాఉంటే.

2021 ఏడాదికి గాను కెనడాకు సుమారు 4.50 లక్షల మంది విద్యార్ధులు రాగా ఇందులో సుమారు 50 శాతం మంది భారతీయ విద్యార్ధులు ఉండటం గమనార్హం.ఇక అమెరికాలోని వర్సిటీలలో ప్రవేశం పొందటం కంటే కూడా కెనడా వర్సిటీలలో ప్రవేశం పొందటం అత్యంత సులభంగా ఉండటం, కేవలం విద్యార్ధి యొక్క మార్కులు, ఆంగ్ల బాష పరిజ్ఞానం, ఈ రెండు అంశాలపైనే వీసా జారీ చేయడం, కెనడాలో ఉద్యోగుల కొరత భారీగా ఏర్పడటంతో వాటిని విదేశీ నిపుణులతో ముఖ్యంగా భారతీయ నిపుణులతో భర్తీ చేయాలని భావించడం, ఇవన్నీ విద్యార్ధి వీసాలకు కెనడా సులభంగా ఎంట్రీ ఇచ్చేలా చేశాయని, పైగా భారత్ నుంచీ అమెరికాకు ఉన్నత చదువుల కోసమని కొన్నేళ్ళ క్రితం వెళ్ళిన విద్యార్ధులే నేడు అమెరికా అభివృద్ధిలో కీలక పాత్ర పోషించడంతో ప్రతిభగల భారతీయ విద్యార్ధులను ఆకర్షించేందుకు కెనడా సులభ రీతిలో విద్యార్ధి వీసాలను, పర్మినెంట్ హోదాను తక్కువ సమయంలో అందిస్తోందని అంటున్నారు పరిశీలకులు
.






